టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు విరాళం ఇచ్చారు చెన్నైకి చెందిన భక్తులు. చెన్నైకి చెందిన వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ సంస్థ చైర్మెన్ వర్థమాన్ జైన్ శనివారం ( మే 16 ) టీటీడీకి ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ముందు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సుకు సంబంధించిన పత్రాలు, తాళాలను టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో దాతతో కలిసి బస్సులో ప్రయాణించి, ప్రయాణికులకు ఈ బస్సు చాలా సౌకర్యవంతంగా ఉందని దాతను అభినందించారు. ఈ బస్సును తిరుమలలోని భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సు గా వినియోగించనున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు శ్రీ డి.పి.అనంత, తిరుమల ట్రాన్స్ పోర్ట్ డీఐ కృష్ణయ్య పాల్గొన్నారు.
