చెన్నై చమక్‌‌ ..63 రన్స్‌‌ తేడాతో గుజరాత్‌‌పై గెలుపు

చెన్నై చమక్‌‌ ..63 రన్స్‌‌ తేడాతో గుజరాత్‌‌పై గెలుపు
  • దంచికొట్టిన దూబె, రుతురాజ్‌‌, రచిన్‌‌

చెన్నై : ఐపీఎల్‌‌–17లో చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌‌లో శివమ్‌‌ దూబె (51), రుతురాజ్‌‌ (46), రచిన్‌‌ రవీంద్ర (46) మెరుపులు మెరిపించడంతో.. మంగళవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 63 రన్స్‌‌ తేడాతో గుజరాత్‌‌ టైటాన్స్‌‌ను ఓడించింది. టాస్‌‌ ఓడిన చెన్నై 20 ఓవర్లలో 206/5 స్కోరు చేసింది. తర్వాత గుజరాత్‌‌ 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. సాయి సుదర్శన్‌‌ (31) టాప్‌‌ స్కోరర్‌‌. సాహా (21), మిల్లర్‌‌ (21) కాసేపు పోరాడినా సీఎస్కే బౌలర్లు చాన్స్‌‌ ఇవ్వలేదు. శివమ్‌‌ దూబెకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.

దూబె మెరుపులు..

సీఎస్కేకు ఓపెనర్లు రుతురాజ్, రచిన్‌‌  మెరుపు ఆరంభాన్నిచ్చారు. రెండో ఓవర్‌‌లో 6, 4తో టచ్‌‌లోకి వచ్చిన రవీంద్ర వరుసపెట్టి 4, 4, 6, 4 దంచాడు. రుతురాజ్‌‌ రెండు ఫోర్లతో ఖాతా తెరిచాడు. ఐదో ఓవర్‌‌లో 6, 4, 4 కొట్టిన రవీంద్రను ఆరో ఓవర్‌‌లో రషీద్‌‌ ఖాన్‌‌ (2/49) ఔట్‌‌ చేశాడు. దీంతో తొలి వికెట్‌‌కు 62 రన్స్‌‌ భాగస్వామ్యం బ్రేక్​ అయ్యింది. రుతురాజ్‌‌ ఫోర్‌‌తో పవర్‌‌ప్లేలో చెన్నై 69/1 స్కోరు చేసింది. వన్‌‌డౌన్‌‌లో రహానె (12) స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేయడంతో తర్వాతి 4 ఓవర్లలో 35 రన్స్‌‌ వచ్చాయి.

ఫలితంగా స్కోరు 104/1కి పెరిగింది. 11వ ఓవర్‌‌లో సాయి కిశోర్‌‌ (1/28) టర్నింగ్‌‌ బాల్‌‌ను ఫ్రంట్‌‌ ఫుట్‌‌ ఆడబోయి రహానె స్టంపౌటయ్యాడు. రెండో వికెట్‌‌కు 42 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. దూబె తొలి రెండు బాల్స్‌‌ను భారీ సిక్సర్లుగా మలిచాడు. 13వ ఓవర్‌‌లో రుతురాజ్‌‌ స్టంపౌట్‌‌ కావడంతో సీఎస్కే 127 వద్ద మూడో వికెట్‌‌ కోల్పోయింది.  దూబెతో కలిసిన డారిల్‌‌ మిచెల్‌‌ (24*) ఫోర్‌‌తో ఆట ఆరంభించాడు. దూబె 6, 4, 6తో 15 ఓవర్లలో స్కోరు 155/3కి చేరింది.

ఇక్కడి నుంచి ఇన్నింగ్స్‌‌ కాస్త స్లో అయ్యింది. మిచెల్‌‌ 4, దూబె 4, 6 మాత్రమే కొట్టారు. 22 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేసిన దూబె19వ ఓవర్‌‌లో ఔట్‌‌కావడంతో నాలుగో వికెట్‌‌కు 57 రన్స్‌‌ జతయ్యాయి. సమీర్‌‌ రిజ్వి (14) 6, 6 కొట్టి ఔటైనా, జడేజా (7*) 2, 4 బాదాడు. లాస్ట్‌‌ ఐదు ఓవర్లలో 51 రన్స్‌‌ వచ్చాయి. 

బౌలర్లు అదుర్స్‌

భారీ ఛేజింగ్‌‌లో గుజరాత్‌‌ను సీఎస్కే పేసర్లు అడ్డుకున్నారు. థర్డ్‌‌ ఓవర్‌‌లో శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (8) ఔట్‌‌కాగా, సాహా, సాయి సుదర్శన్‌‌ ఇన్నింగ్స్‌‌ను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. కానీ ఐదో ఓవర్‌‌లో దీపక్‌‌ చహర్‌‌ (2/28) దెబ్బకు సాహా వెనుదిరగడంతో గుజరాత్‌‌ వికెట్ల పతనం మొదలైంది. పవర్‌‌ప్లేలో జీటీ 43/2 స్కోరుకే పరిమితమైంది. ఇక్కడి నుంచి సుదర్శన్‌‌ నిలకడగా ఆడినా 8వ ఓవర్‌‌లో విజయ్‌‌ శంకర్‌‌ (12) భారీ షాట్‌‌కు యత్నించి వికెట్‌‌ ఇచ్చుకోవడంతో జీటీ 55/3తో కష్టాల్లో పడింది.

ఈ దశలో మిల్లర్‌‌, సుదర్శన్‌‌తో కలిసి చకచకా బౌండ్రీలు బాదాడు. జీటీ తొలి 10 ఓవర్లలో 80/3 స్కోరు చేసింది. కానీ 12వ ఓవర్‌‌లో తుషార్‌‌ (2/21) బౌలింగ్‌‌లో రహానె సూపర్‌‌ క్యాచ్‌‌ పట్టడంతో మిల్లర్‌‌ వెనుదిరిగాడు. దీంతో నాలుగో వికెట్‌‌కు 41 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 15వ ఓవర్‌‌లో పతిరణ (1/29) సుదర్శన్‌‌ను పెవిలియన్‌‌కు చేర్చాడు. తర్వాతి ఓవర్‌‌లో తుషార్‌‌.. అజ్మతుల్లా (11) వికెట్‌‌ తీశాడు. ఆరు బాల్స్‌‌ తర్వాత ముస్తాఫిజుర్‌‌ (2/30).. రషీద్‌‌ ఖాన్‌‌ (1)ను ఔట్‌‌ చేశాడు. మధ్యలో రాహుల్‌‌ తెవాటియా (6)తో పాటు ఉమేశ్‌‌ (10*), జాన్సన్‌‌ (5*) భారీ షాట్లకు ట్రై చేసి ఫెయిలయ్యారు.