ప్రజల పోరాటం వల్లే ప్రత్యేక తెలంగాణ: వివేక్ వెంకటస్వామి

ప్రజల పోరాటం వల్లే ప్రత్యేక తెలంగాణ: వివేక్ వెంకటస్వామి
  •     ఉద్యమకారులను కేసీఆర్‌‌‌‌ మోసం చేసిండు: వివేక్‌‌ వెంకటస్వామి
  •     ఆత్మహత్య చేసుకున్న అమరుల కుటుంబాలను సొంతంగా ఆదుకున్న
  •     తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభలో చెన్నూరు ఎమ్మెల్యే
  •     ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను కేంద్రానికి వివరించా

ముషీరాబాద్, వెలుగు: అన్ని వర్గాల ప్రజలు, ఉద్యమకారుల పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎంపీలుగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను కేంద్రానికి వివరించినట్లు చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడుతుంటే ఆంధ్ర ప్రాంత నాయకులు ఎన్నో అడ్డంకులు సృష్టించినా వాటిని తిప్పికొడుతూ ముందుకెళ్లామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చైర్మన్ చీమ శ్రీనివాస్ అధ్యక్షతన తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వివేక్ వెంకటస్వామి హాజరై మాట్లాడారు. ఉద్యమ సమయంలో అన్ని ఆంధ్ర న్యూస్ చానల్స్ ఉండేవని, మన సమస్యను.. మన వాణిని వినిపించేందుకు వీ6 న్యూస్ చానల్ ప్రారంభించి, తెలంగాణ గొంతుకగా ప్రజల్లోకి తీసుకెళ్లానని గుర్తుచేశారు. దేని కోసమైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాడేమో రాష్ట్రం వచ్చాక ఏం జరిగిందో తనకంటే మీకే బాగా తెలుసన్నారు. తెలంగాణ వచ్చాక ఉద్యమకారులకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని, మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమకారులను మోసం చేశారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న 300 అమరుల కుటుంబాలకు తాను ఆర్థిక సాయం చేశానని వెల్లడించారు. 

ఉద్యమకారులకు  200 గజాల భూమి..

ఉద్యమకారులకు 200 గజాల భూమి, ఉద్యమకారుల భవన్ కోసం రెండెకరాల స్థలం, పెన్షన్, బస్సు పాస్, సంక్షేమ బోర్డు, ఐడీ కార్డుతో పాటు తదితర సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని వివేక్‌ వెంకటస్వామి హామీ ఇచ్చారు. రాష్ట్రం కోసం ఉద్యమకారులు చేసిన త్యాగాలను గత ప్రభుత్వం విస్మరించిదన్నారు. అంతేకాకుండా తనపై ఈడీ, ఐటీ రైట్స్ చేపట్టి ఇబ్బందులకు గురి చేశారని, కక్ష కట్టి ఎన్నికల్లో ఓడించాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారుల ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఉద్యమకారుల ద్రోహిగా మారిన కేసీఆర్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు 200 గజాల ఇంటి స్థలం అమలయ్యేలా చూడాలని వివేక్‌ను ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి వెంటనే కమిటీని ఏర్పాటు చేసి.. జూన్ 2న ఉద్యమకారులను అధికారికంగా అన్ని ప్రాంతాల్లో సన్మానించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫోరం నేతలు సురేందర్ రెడ్డి, జ్యోతి రెడ్డి, కోల్లా జనార్దన్, ఐలయ్య యాదవ్, వెంకటేశ్‌ గౌడ్, లాలయ్య, వీరస్వామి, ఇంద్ర కుమార్, నూనె రాజేశం, మాడ నారాయణరెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

జైపూర్​లో థర్మల్‌ పవర్ ప్లాంట్‌ పనులు ప్రారంభించండి
    

హైదరాబాద్‌, వెలుగు: సింగరేణి ఆధ్వర్యంలో జైపూర్‌లో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులను ప్రారంభించాలని సీఎం రేవంత్‌ రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి కోరారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి.. జైపూర్​లో 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, కొన్నేండ్ల క్రితం ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాంట్​లోనే సింగరేణి మరో 800 మెగావాట్ల థర్మల్‌ ప్లాంట్‌ నిర్మించనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి నూతన థర్మల్‌ ప్లాంట్​కు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.