- గతంలో అప్లై చేసుకున్నోళ్లు మళ్లీ చేయనక్కర్లేదు
- తొలి విడతలో 7 కేటగిరీలకే అవకాశం.. పాత రూల్సే ప్రామాణికం
- ఇప్పటికే కొత్తగా నాలుగు వేలకు పైగా అప్లికేషన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ‘చేయూత’ పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన ‘సెర్ప్’ మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు సెర్ప్ సీఈవో దివ్య దేవారాజన్ సర్క్యులర్ జారీ చేస్తూ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్‌డీఓలకు ఆదేశాలు ఇచ్చారు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను ఈ నెల 31వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణతో పాటు సమాంతరంగా పోర్టల్‌లో డేటా ఎంట్రీ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి తనిఖీల కాలపరిమితి, ఫైనల్ లిస్టుల ఖరారు, ప్రొసీడింగ్స్ పంపిణీ షెడ్యూల్‌ను త్వరలోనే విడిగా ప్రకటిస్తామని తెలిపారు. అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పులు లేవని, పాత నిబంధనల ప్రకారమే ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు.
మళ్లీ అప్లై చేయక్కర్లేదు..
‘ప్రజాపాలన’ వారోత్సవాలు, 99 రోజుల ‘ప్రగతి ప్రణాళిక’ గ్రామసభలు, ‘ప్రజావాణి’లో ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అవసరమైన పత్రాలు సమర్పించినవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. గతంలో దరఖాస్తు చేయనివారు లేదా అవసరమైన ఆధారాలు జతచేయని అర్హులు మాత్రమే పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు అందజేసిన లబ్ధిదారులకు అధికారులు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ఆదేశించారు. తొలి విడతలో 7 కేటగిరీల వారికి పింఛన్లు మంజూరు చేయనున్నారు. దరఖాస్తుదారులు తమ కేటగిరీని బట్టి ధ్రువపత్రాలను జతచేయాల్సి ఉంటుంది.
వితంతువులు భర్త డెత్ సర్టిఫికేట్, ఒంటరి మహిళలు సెపరేషన్ నివేదిక, గీత కార్మికులు ఎక్సైజ్ శాఖ సర్టిఫికేట్, చేనేత కార్మికులు చేనేత శాఖ సర్టిఫికేట్, పైలేరియా బాధితులు హెల్త్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. వితంతువులు, ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకోవడంతోపాటు వారికి అవసరమైన సర్టిఫికెట్లు పొందేలా సహాయం చేసే బాధ్యతను ఎస్‌హెచ్‌జీ సమాఖ్యలకు అప్పగించారు. కాగా, చేయూత పింఛన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. గడువు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటివరకు కొత్తగా మరో 4 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గడువు ముగిసేనాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
