
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ కొత్త ఎమ్మెల్యేల క్రిమినల్ కేసుల చిట్టాను కూడా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) బయటపెట్టింది. కొత్తగా ఎన్నికైన 90 మంది ఎమ్మెల్యేల్లో 17 మంది (సుమారు 19%) నేర చరిత్ర గలవారేనని వెల్లడించింది. వీరిలో ఆరుగురు (7%) ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది.
అభ్యర్థులు ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్‌ల ఆధారంగా ఈ విషయాల్ని వెల్లడిస్తున్నట్లు ఏడీఆర్ స్పష్టం చేసింది. బీజేపీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది (22%), కాంగ్రెస్‌కు చెందిన 35 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు (14%)పై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నవారి లిస్టులో మాజీ సీఎం భూపేశ్ బాఘెల్ కూడా ఉన్నారు.