- హైదరాబాద్ నుంచి కోళ్ల వ్యర్థాలు తెప్పించి చేపలకు ఆహారంగా వేస్తున్న నిర్వాహకులు
- చికెన్ వేస్టేజీ, కుళ్లిన కోడిగుడ్ల సప్లైకి లక్షల్లో కాంటాక్ట్లు
- ఇలా పెరిగిన చేపలు తింటే రోగాలు ఖాయమంటున్న డాక్టర్లు
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలోని కృష్ణ, తుంగభద్ర నది తీర ప్రాంతాల్లో నిషేధిత క్యాట్ ఫిష్, ఫంగస్ చేపల పెంపకం గుట్టుగా సాగుతోంది. వందల ఎకరాలు లీజుకు తీసుకొని క్యాట్ ఫిష్ దందాను కొనసాగిస్తున్నారు. చుట్టూ సాధారణ చేపల చెరువులు ఉండేలా చూసుకుంటున్న నిర్వాహకులు, వాటి మధ్యలో క్యాట్ ఫిష్, ఫంగస్ చేపల చెరువులు పెట్టి దందా సాగిస్తున్నారు.
గద్వాల జిల్లాతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి చికెన్ వేస్టేజీ, కుళ్లిన గుడ్లు జిల్లాకు వస్తున్నాయి. ఇలా పెంచిన నిషేధిత చేపలను గుట్టుగా హైదరాబాద్, బెంగుళూరు తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
అంతా రాత్రి పూటనే..
చికెన్ వేస్టేజీ, కుళ్లిన కోడిగుడ్లను చికెన్ సెంటర్ల నుంచి సాయంత్రం ఒక వెహికల్ ద్వారా సేకరించి అర్ధరాత్రి చేపల చెరువులకు తరలిస్తున్నారు. వారు వాటిని ఉడికించి చేపలకు ఆహారంగా వేస్తున్నారు. చేపలు పెరిగి పెద్దయ్యాక రాత్రి సమయంలోనే హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
చికెన్ వ్యర్థాల టెండర్ కోసం పోటాపోటీ..
జోగులాంబ గద్వాల జిల్లాలో ఏటా రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల చికెన్ వేస్టేజ్ వ్యర్థాల దందా కొనసాగుతోంది.ఒకప్పుడు వృథాగా పారేసే చికెన్ వేస్టేజీకి ఇప్పుడు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది. చికెన్ వ్యర్థాలు, కుళ్లిపోయిన కోడిగుడ్లు చేపలకు ఆహారంగా వేస్తుండడంతో వీటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఒక్కో కేజీ వేస్టేజీని రూ.8కి కొనుగోలు చేసి చేపల చెరువుల నిర్వాహకులకు రూ.15కు అమ్ముతున్నారు. ముందుగానే చికెన్ సెంటర్ల ఓనర్లకు అడ్వాన్సులు చెల్లించి ప్రతిరోజు వేస్టేజీని తీసుకెళ్తున్నారు.
వేస్టేజీ కోసం లొల్లి..
గద్వాలలో కొన్ని రోజులుగా చికెన్ వేస్టేజీ కోసం లొల్లి జరుగుతోంది. చికెన్ వేస్టేజీని తరలించేందుకు సెంటర్ల నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్నారు. ఇలా టెండర్ దక్కించుకున్న వ్యక్తి గడువు ముగిసినప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడంతో చికెన్ సెంటర్ నిర్వాహకులు గొడవ పడుతున్నారు. వాస్తవంగా ప్రతి సంవత్సరం ముందుగానే డబ్బులు చెల్లించి చికెన్ వ్యర్థాలు తీసుకెళ్లేవారు. కానీ, ఈసారి టెండర్ ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో వివాదం ముదురుతోంది.
పొలాలను లీజుకు తీసుకొని..
ఇటిక్యాల మండలంలోని మొగిలి రావులచెరువు, తిమ్మాపూర్, షేక్ పల్లి, బీచుపల్లి, ధరూర్ మండలం ఉప్పేరు, గార్లపాడు, నెట్టెంపాడు, ఖమ్మంపాడు గ్రామ నది తీర ప్రాంతాల్లో క్యాట్ ఫిష్ పెంపకం కొనసాగుతుండగా, ఒక్క తిమ్మాపూర్ గ్రామంలోనే 100 ఎకరాల్లో క్యాట్ ఫిష్ పెంచుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలోని కృష్ణ, నెల్లూరు ప్రాంతాలకు చెందినవారు ఇక్కడికి వచ్చి రైతుల పొలాలను లీజుకు తీసుకొని ఫంగస్, క్యాట్ ఫిష్ చేపలను పెంచుతున్నారు.
వీటిని సాధారణ దాణాతో పెంచితే ఒకే పంట వస్తుంది. కానీ, ఫంగస్, క్యాట్ ఫిష్ ను చికెన్ వ్యర్ధాలు, కుళ్లిన గుడ్లను ఉడికించి పెంచితే ఏడాదిలో రెండు పంటలు వచ్చి మంచి ఆదాయం వస్తోంది. దీంతో కొంత కాలంగా వీటిని పెంచుతున్నారని అంటున్నారు.
వాటిని తింటే అనారోగ్యమే..
చికెన్ వ్యర్థాలతో పెంచిన చేపలు తింటే అనారోగ్యం బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్యాట్ ఫిష్ తింటే క్యాన్సర్ బారిన పడుతుండడంతో వాటిని గతంలోనే నిషేధించారు. అయినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా క్యాట్ ఫిష్, ఫంగస్ చేపలను పెంచుతున్నారు. ఈ చేపలు తింటే మనుషులకు రోగాలు వస్తాయని, పర్యావరణానికి హాని కలుగుతుందని, నదీ జలాలు కలుషితం అవుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
నిఘా పెడతాం..
జిల్లాలో క్యాట్ ఫిష్ చేపల చెరువులు లేవు. చికెన్ వ్యర్థాలతో చేపల పెంపకం చేపట్టవద్దు. ఫంగస్ చేపల నిర్మూలనకు చర్యలు తీసుకునేందుకు ఇబ్బందులు ఉన్నాయ్. చికెన్ వ్యర్థ్యాలతో చేపలు పెంచుతున్న చెరువులపై నిఘా పెట్టి చర్యలు తీసుకుంటాం.
- షకీలా భాను, ఏడీ ఫిషరీస్
