
- డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సదస్సులో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ : చాలా తక్కువ శాతం మందే కోర్టులకు వస్తున్నారని, మెజారిటీ ప్రజలకు న్యాయం అందడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం పొందడం సామాజిక విముక్తికి ఒక సాధనంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ వినియోగం బాగా పెరిగిందని, న్యాయ వ్యవస్థ కూడా టెక్నాలజీని అన్వయించుకుని ప్రజలకు త్వరగా న్యాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం న్యూఢిల్లీలో ఆలిండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తొలి సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ.. జస్టిస్ డెలివరీ మెకానిజం మెజారిటీ ప్రజలకు చేరడంలేదని, ప్రతి ఇంటికీ న్యాయాన్ని అందించగలిగే మెకానిజం లేదని, అలాంటి వ్యవస్థను తీసుకుని రావాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయమే అత్యంత కీలకమైనదని చెప్పారు. సమాజంలో అసమానతలను తొలగించినప్పుడే మోడ్రన్ ఇండియాను నిర్మించగలమని చెప్పారు. 27 ఏండ్ల క్రితం ఏర్పాటైన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నాల్సా) దేశ జనాభాలో 70 శాతం మందికి ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తోందని, ఇది ఎంతో గొప్ప విషయమని కొనియాడారు.
ఈజ్ ఆఫ్ జస్టిస్ కూడా ముఖ్యమే: ప్రధాని మోడీ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాదిరిగానే.. ఈజ్ ఆఫ్ జస్టిస్ కూడా ముఖ్యమేనని ప్రధాని మోడీ అన్నారు. ఇందుకు న్యాయపరమైన మౌలిక సదుపాయాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీల విడుదలను వేగవంతం చేయాలని న్యాయవ్యవస్థను ప్రధాని కోరారు. ఈ సదస్సులో దేశం నలుమూలల నుంచి 1,200 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.