
పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్లో నకిలీ నర్సును గుర్తించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) ఆమెను పోలీసులకు అప్పగించారు. బుధవారం రాత్రి ఎమర్జెన్సీ బ్లాక్లో ఓ పేషెంట్దగ్గరికి వెళ్లి వస్తున్న నర్సును చూసి అనుమానించిన సీఎంవో ఆమెను విచారించారు. ఆమె నర్సు కాదని.. ఆ యువతి(25) వద్ద రేష్మ(25) పేరుతో గాంధీ హాస్పిటల్ ఫేక్ ఐడీ కార్డు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే చిలకలగూడ పోలీసులకు ఆమెను అప్పగించారు. అయితే, పోలీసుల ముందే ఆ యువతి బట్టలు విప్పేందుకు ప్రయత్నించి హల్చల్ చేసింది.
దీంతో ఆ యువతి మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు భావించిన పోలీసులు ఆమె ఉంటున్న లేడీస్ హాస్టల్కు తరలించారు. అయితే అక్కడి నుంచి ఆమె పారిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, రెండ్రోజుల కిందట హాస్పిటల్లోని ఓపీ బ్లాక్ పై అంతస్తులో ఉన్న పీజీ మహిళా స్టూడెంట్స్ హాస్టల్లోకి ఓ యువతి ప్రవేశించి తాను పీజీ డాక్టర్ అని చెప్పుకొని హల్చల్ చేసింది. అనుమానం వచ్చిన హాస్టల్ ఇన్చార్జి విచారించగా.. ఆమె పీజీ డాక్టర్ కాదని తేలింది. పేషెంట్ల ఆందోళన ఫేక్ మెడికల్ స్టాఫ్ ఉదంతాలు బయటపడుతుండటంతో పేషెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరో వచ్చివైద్యం చేసి వెళ్తే తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ టైట్ చేసి, నాణ్యమైన వైద్యం అందించాలని కోరుతున్నారు.