
- జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం మీటింగ్ పై సర్వత్రా చర్చ
- లోకల్ బాడీ ఎన్నికలకు గ్రౌండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారా?
- పాలనపై ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుంటున్నారా?
- ఇంటెలిజెన్స్ రిపోర్టును, ఎమ్మెల్యేలతో భేటీలో వచ్చిన అంశాలను చెక్ చేసుకుంటున్నారా?
- తనతో భేటీ అయిన వాళ్ల పనితీరును అంచనా వేస్తున్నారా?
- ఇప్పటికే మూడు జిల్లాల ఎమ్మెల్యేతో భేటీ పూర్తి
- చర్చనీయాంశంగా మారిన ముఖ్యమంత్రి రివ్యూలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా రివ్యూలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే మూడు జిల్లాల రివ్యూలు పూర్తయ్యాయి. సమస్యలు ఏం ఉన్నాయ్..? ఏం చేద్దాం..? మీ పనితీరు ఎలా ఉంది.. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? అంటూ ఆరా తీస్తున్నారని సమాచారం.
ఎమ్మెల్యేల ఆలోచనలేంటో చెప్పాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేలకు ఉన్న ప్రజాసంబంధ అవసరాలు, బాధలు వినేందుకు తాను సిద్ధమంటున్నారు. ఇప్పటి వరకు నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్ జిల్లాల ఎమ్మెల్యేలతో మాట్లాడారు.
గతంలో మాదిరి కాకుండా ఈసారి ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా భేటీ అయినట్టు తెలిసింది. ప్రతి ఎమ్మెల్యేతో 10 నుంచి15 నిమిషాలపాటు మాట్లాడిన సీఎం ఎమ్మెల్యేల అభిప్రాయాలను వినడంతోపాటు వారికి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకురావాలని, కాంగ్రెస్ నుంచి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే తనకు సమానమేనని, అందరికీ తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు.
పంచాయతీ ఎన్నికల కోసమేనా
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతన్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే సీఎం జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారని, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే సర్పంచులకు ప్రభుత్వం బకాయి పడి ఉన్న బిల్లులను రిలీజ్ చేసిందని సమాచారం. రూ. 10 లక్షల లోపు ఉన్న బిల్లులను ప్రభుత్వం రిలీజ్ చేసింది.
నిన్న ఒక్క రోజే 153 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులను ప్రభుత్వ విడుదల చేసింది. త్వరలోనే రైతు భరోసా వేసేందుకు కూడా సిద్ధమవుతోందని సమాచారం. జూన్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ప్రస్తావన కూడా ఈ సందర్భంగా వచ్చినట్టు సమాచారం. మొదట పంచాయతీ ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనుందనే చర్చ ఉంది.
సీఎం దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ఇంటెలిజెన్స్ రిపోర్టు ను తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే పలు హామీలను అమలు చేసిన దరిమిలా గ్రౌండ్ రిపోర్ట్ ఏమిటన్న అంశంపై క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అవుతూ.. స్థానిక అంశాలపై చర్చిస్తూ వాటిని పరిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న క్రమంలో వారి పనితీరుపైనా చర్చ జరుగుతోందని సమాచారం.