V6 News

కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు హాజరైన సీఎస్

కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు హాజరైన సీఎస్

హైదరాబాద్, వెలుగు: ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నప్పుడు దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు బుధవారం హైకోర్టు విచారణకు స్వయంగా హాజరయ్యారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసినట్టు ఆయన చెప్పారు. దీంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణను న్యాయమూర్తి మూసివేశారు.

సూర్యాపేట జిల్లాలోని నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న ఇద్దరు పార్టటైం స్వీపర్లు ఇంక్రిమెంట్లతోపాటు కనీస వేతనాన్ని చెల్లించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అప్పుడు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో స్వీపర్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై జస్టిస్ ఇ.వి వేణుగోపాల్ విచారణ జరిపారు.

పిటిషనర్లకు టైం స్కేలును చెల్లించాంటూ 2023 జారీ చేసిన ఉత్తర్వులను అప్పటి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు అమలు చేయకపోవడంతో ఆయనను స్వయంగా విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణారావు బుధవారం హైకోర్టు ముందు హాజరయ్యారు.