- గ్లోబల్ సమ్మిట్ కు ముందే డీపీఆర్ లు సిద్ధం చేయాలి
- అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టూరిజం పాలసీ భాగంగా రాష్ట్రంలో మెడికల్ వెల్‌నెస్ టూరిజం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ముందే ప్రాజెక్టుల డీపీఆర్ లను సిద్ధం చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సిటీలో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలతో పాటు 89 ఎన్‌ఏబీహెచ్, 8 ఏసీఐ గుర్తింపు పొందిన హాస్పిటల్స్ ఉండటం వల్ల మిడిల్ఈస్ట్, ఆఫ్రికా దేశాల నుంచి రోగులు భారీగా వస్తున్నారని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ఇన్వెస్ట్ తెలంగాణ ద్వారా ఈ రంగానికి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పెట్టుబడులు, అంతర్జాతీయ ప్రచారంపై దృష్టి సారించాలని సీఎస్ అధికారులకు సూచించారు. వైద్య సేవల కోసం సింగిల్ విండో పోర్టల్ ఏర్పాటు చేయడంతో పాటు ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ ప్రక్రియలను రూల్స్ ప్రకారం పారదర్శకంగా క్రమబద్ధీకరించాలన్నారు. రాష్ట్రాన్ని గ్లోబల్ మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
కరువు మండలాల గుర్తింపు స్పీడప్
కరువు మండలాల గుర్తింపు ప్రక్రియను స్పీడప్చేయాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. వర్షపాతం, పంటల సాగు విస్తీర్ణం, నేలలో తేమ, భూగర్భజలాలు, చెరువులు, జలాశయాల్లో నీటి మట్టాల ఆధారంగా కరువు ప్రభావిత మండలాలను గుర్తించి ప్రాథమిక నివేదికలు సిద్ధం చేయాలన్నారు. వచ్చే ఏడాది 6 నెలల దాకా వర్షపాతం లోటు కొనసాగే అవకాశం ఉన్నందున, ముందస్తు ప్రణాళికలు అవసరమన్నారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తామన్న సంజయ్‌జాజు.. కరువును ఎదుర్కొనేందుకు నిధుల కొరత లేదన్నారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమావేశం అనంతరం సచివాలయం నుంచి రైతు వేదికల ద్వారా రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని వెల్లడించారు.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించాలి
- సీఎస్‌కు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వినతి
హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ ఆస్పత్రుల్లో రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సచివాలయంలో సీఎస్ సంజయ్ జాజును మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, సంపాదకుడు జె.వెంకట్ రెడ్డితో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా కార్పొరేట్ ఆస్పత్రులు హెల్త్ కార్డ్ లను లెక్కచేయడం లేదన్నారు. అత్యవసర సమయంలో అనారోగ్యంతో వచ్చే వృద్ధ పెన్షనర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, అందరికీ క్యాష్‌లెస్ వైద్యం అందేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
