బడికెళ్లొచ్చింది.. గంటల్లోనే ఊపిరి ఆగింది

బడికెళ్లొచ్చింది.. గంటల్లోనే ఊపిరి ఆగింది
  • అనుమానాస్పద స్థితిలో నాలుగేండ్ల బాలిక మృతి

కుషాయిగూడ, వెలుగు: అప్పటివరకు ఆడిపాడిన చిన్నారి కొద్ది సమయానికి అనుమానాస్పదంగా చనిపోయి తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది. కుషాయిగూడ ప్రాంతానికి చెందిన రమేశ్, కల్యాణిలు 2018లో ప్రేమ పెండ్లి చేసుకున్నారు. ఆపై గొడవల కారణంగా రెండేండ్ల కిత్రం వారు విడిపోయారు. వీరి కూతురు తన్విత(4) తల్లి దగ్గరే ఉంటోంది. సమీపంలోనే నివసించే తండ్రి వద్దకు అప్పుడప్పుడు వెళ్లి వచ్చేది. ఈ ఏడాదే స్కూల్​కు వెళ్లడం ప్రారంభించిన తన్విత.. శనివారం స్కూల్​కు వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికొచ్చింది. కాసేపు తల్లితో ఆడుకొని, ఆపై అన్నం తిని పడుకుంది. అయితే, సాయంత్రం 6 గంటలు అవుతున్నా పాప లేవకపోవడంతో తల్లి కళ్యాణి లేపే ప్రయత్నం చేసింది. 

చలనం లేకపోవడంతో వెంటనే దగ్గరలోని ఓ క్లినిక్​తోపాటు ఈసీఐఎల్​లోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు చేర్చుకోకపోవడంతో ఏఎస్​రావు నగర్​లోని అంకుర ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు పాప అప్పటికే చనిపోయిందని ధ్రువీకరించారు. సమాచారం తెలుసుకొని ఆస్పత్రికి చేరుకున్న తండ్రి రమేశ్.. తన కూతురు మృతిపట్ల అనుమానం వ్యక్తం చేస్తూ​కుషాయిగూడ పోలీసులకు కంప్లైంట్​చేశారు. బాలిక డెడ్​బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించగా పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే తన్విత మృతికి కారణాలు తెలిసే అవకాశం ఉంది.