చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం.. లింగంపల్లి రైల్వే స్టేషన్లో రెండు రోజుల కింద అపహరణ

చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం.. లింగంపల్లి రైల్వే స్టేషన్లో రెండు  రోజుల కింద అపహరణ
  • పిల్లలు లేని బెంగాల్​ మహిళకు అమ్మిన కిడ్నాపర్లు
  • తల్లిదండ్రులకు అప్పగించిన సైబరాబాద్​ సీపీ
  • ఇద్దరు కిడ్నాపర్లు, మీడియేటర్లు, అమ్మిన మహిళ​అరెస్ట్​

గచ్చిబౌలి, వెలుగు: తల్లి ఒడిలో నిద్రిస్తున్న నెల రోజు పాపను కిడ్నాప్​ చేసిన కేసులో సైబరాబాద్  పోలీసులు ఇద్దరు కిడ్నాపర్లు, ఇద్దరు మీడియేటర్లు, పాపను కొన్న బెంగాల్​కు చెందిన మహిళను అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి శిశువును స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. గచ్చిబౌలి సైబరాబాద్​ పోలీస్​కమిషనరేట్​లో సీపీ రమేశ్, శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్​ వివరాలు వెల్లడించారు. 

కోల్​కతాకు చెందిన రహనుమా అలీ(30)కి మహమ్మద్​సనావర్​తో 2021లో పెండ్లయ్యింది. వీరికి పిల్లలు లేకపోవడంతో పిల్లల కోసం బంజారాహిల్స్​లో ఉండే బంధువు బ్యూటీషియన్  నిమ్మి జహాన్​అలీకి, ఆమె నేరెడ్​మెట్​లో చంద్రగిరికాలనీలో ఉండే తన స్నేహితురాలు నజియాకు, నజియా వికారాబాద్​కు చెందిన తనకు కాబోయే భర్త వికారాబాద్​కు చెందిన బైక్​ మెకానిక్​ జుబేర్​కు, జుబేర్​తన స్నేహితుడైన ఆటో డ్రైవర్​ మహమ్మద్​ ఇర్ఫాన్​కు చెప్పాడు. 

ఇర్ఫాన్​ గతంలో దొంగతనాలకు పాల్పడి అరెస్ట్​ అయ్యాడు. పిల్లలను కిడ్నాప్​ చేసి అమ్మితే డబ్బు వస్తుందని జుబేర్​ చెప్పడంతో ఇద్దరూ కిడ్నాప్​కు రెడీ అయ్యారు. దీని కోసం ఇద్దరూ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఫుట్​పాత్​ల దగ్గర రెక్కీ చేశారు. ఈక్రమంలో లింగంపల్లి రైల్వే స్టేషన్​ ప్రహారీ గోడకు అనుకొని తల్లిదండ్రుల వద్ద నిద్రపోతున్న నెల రోజుల శిశువు కనిపించాడు.

కిడ్నాప్​ చేసి ఆటోలో పరారీ..

కర్నాటక రాష్ట్రం బీదర్​ జిల్లా బాల్కికి చెందిన మాలన్​ భౌరవ్​ శాంతాబాయి తన భర్త, కుటుంబసభ్యులతో కలిసి లింగంపల్లి ఏరియాలో ఉంటూ సర్కస్​ చేసి బతికేది. లింగంపల్లి రైల్వే స్టేషన్  గోడకు అనుకొని ఉన్న ఫుట్​పాత్​పై పడుకునేవారు. శాంతాబాయికి నెల రోజు పాప ఉంది. జుబేర్, ఇర్ఫాన్​ గత నెల 30 అర్ధరాత్రి దాటిన తర్వాత శాంతాబాయి ఒడిలో ఉన్న శిశువును కిడ్నాప్​ చేశారు. పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, బిడ్డ ఏడవడంతో లేచిన శాంతాబాయి నిందితులను వెంబడించింది. వారు ఆటోలో పారిపోగా, చందానగర్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

బిడ్డ కోసం కోల్​కతా నుంచి వచ్చి..

పాపను కిడ్నాప్​ చేసిన జుబేర్, ఇర్ఫాన్  నేరేడ్​మెట్​లోని నాజియా​ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని కోల్​కతాలోని రెహనుమా అలీకి చెప్పడంతో ఈ నెల 1న విమానంలో హైదరాబాద్​ వచ్చారు. పాప కోసం వాళ్లు రూ.1.50 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత శిశువుతో కలిసి గురువారం సాయంత్రం ఫలక్​నూమా ఎక్స్​ప్రెస్​ లో కోల్​కతా వెళ్లేందుకు టికెట్​ బుక్​ చేసుకున్నారు. పాప ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్న సీఐ నరేశ్  టీమ్​ సీసీ కెమెరాల్లో ఆటో నంబర్​ను గుర్తించింది. 

దాని ఆధారంగా నిందితులు ఎవరనేది తెలుసుకున్నారు. శిశువుతో నిందితులు కోల్ కతా వెళ్లిపోతున్నారని గుర్తించి వెళ్లి పట్టుకున్నారు. జుబేర్, ఇర్ఫాన్, మీడియేటర్లుగా వ్యవహరించిన నాజియా, నిమ్మి జహాన్​ అలీను అరెస్ట్​ చేశారు. రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్​ పాల్గొన్నారు.  

కొడుకుల్లేరని.. కిడ్నాప్​  


పద్మారావునగర్: సికింద్రాబాద్  రైల్వే స్టేషన్‌‌‌‌లో గత నెల 20న ఐదేండ్ల బాలుడిని కిడ్నాప్​ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. జీఆర్‌‌‌‌పీ, ఆర్‌‌‌‌పీఎఫ్  పోలీసులు వివరాలు వెల్లడించారు. ఏపీలోని తూర్పుగోదావరికి చెందిన షేక్  అహ్మద్  అలీ సాహెబ్(42) హైదరాబాద్  చింతల్‌‌‌‌లోని ఓ టిఫిన్  సెంటర్‌‌‌‌లో మాస్టర్ కుక్‌‌‌‌. ఇతడికి ముగ్గురు బిడ్డలు కాగా, కొడుకు కావాలని సికింద్రాబాద్​ స్టేషన్​లో ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌పై అమ్మమ్మ పక్కన పడుకున్న బాబును కిడ్నాప్​ చేశాడు. కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు ప్రశ్నించగా రోడ్డుపై దొరికాడని అబద్ధం చెప్పాడు. కిడ్నాప్  వార్త మీడియాలో రావడంతో భయపడి బాబు రోడ్డుపై కనిపించాడని చెప్పి జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌‌‌‌లో అప్పగించాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన జీడిమెట్ల పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరం ఒప్పుకున్నాడు.