- రోజుకు సగటున 3 చైల్డ్ మ్యారేజెస్ ఆపుతున్న అధికారులు
- చట్టాలు ఉన్నా గ్రామాల్లో ఆగని తంతు
- ఒక్క ఏడాదిలోనే 1,299 పెండ్లిళ్ల నిలిపివేత.. వెలుగులోకి రానివి మరెన్నో
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. చట్టాలను కఠినతరం చేశామని, ఐసీడీఎస్, మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉన్నది. ప్రభుత్వం ‘బాల్య వివాహం– బతుకు ఆగమ్’ అనే నినాదంతో ప్రచారం నిర్వహిస్తూ, గడిచిన ఏడాది కాలంలో అధికారికంగా 1,299 బాల్య వివాహాలను అడ్డుకున్నది. అంటే రోజుకు సగటున 3 పెండ్లిళ్లను అధికారులు ఆపుతున్నారు. ఇందులో 506 మంది బాలికలను తిరిగి స్కూళ్లలో చేర్పించగా, 174 మందికి సీసీఐ (చైల్డ్‌కేర్ హోమ్స్)లలో ఆశ్రయం కల్పించారు. మరొక 47 మందికి వృత్తి విద్యా శిక్షణ ఇప్పించారు. వన్ స్టాప్ సెంటర్(ఓఎస్సీ)ల ద్వారా కూడా 262 బాల్య వివాహాల కేసులకు సాయం అందించారు. అయితే, అధికారులు అడ్డుకున్న ఈ 1,299 పెళ్లిళ్లు కేవలం నాణేనికి ఒకవైపు మాత్రమేనని, అధికారుల కంటపడకుండా, వెలుగులోకి రాకుండా తండాలు, వెనుకబడిన పల్లెల్లో జరుగుతున్న చైల్డ్ మ్యారేజెస్ మరెన్నో ఉన్నాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
డ్రాపౌట్లపై ట్రాకింగ్ కరువు..
పల్లెల్లో బాల్య వివాహాలు పెరగడానికి ప్రధాన కారణం విద్యార్థినుల డ్రాపౌట్లు. టెన్త్ లేదా ఇంటర్ చదువుతూ అకస్మాత్తుగా స్కూళ్లు, కాలేజీలు బంద్ చేసిన అమ్మాయిలు, అబ్బాయిల వివరాలపై అధికారులు అస్సలు దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా 1,044 మంది పాఠశాల ఉపాధ్యాయులను ‘చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు(సీపీవోలు)’గా నామినేట్ చేసినప్పటికీ, బడులు మానేస్తున్న పిల్లల సమాచారం సేకరించడంలో వీరు విఫలమవుతున్నారు. ఒక అమ్మాయి సడన్‌గా చదువు ఆపేస్తే.. దానికి కుటుంబ ఆర్థిక పరిస్థితులు కారణమా? లేక గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసి పంపేస్తున్నారా? అనే కోణంలో విచారణ చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ, ఐసీడీఎస్ అధికారులపై ఉంది. కానీ, తండాలు, గ్రామాల్లో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైంది.
ప్రేమ పేరుతో సర్దుబాట్లు..
గ్రామాల్లో మైనర్ వయసులోనే ప్రేమ పేరుతో బాలబాలికలు ఇళ్ల నుంచి బయటకు వెళ్తున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయాల్లో పెద్దలు, స్థానిక రాజకీయ నాయకులు పంచాయితీలు పెట్టి, ఇరువర్గాలను కాంప్రమైజ్ చేసి రహస్యంగా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. చట్ట ప్రకారం ఇది నేరమని తెలిసినప్పటికీ, సమాజంలో పరువు పోతుందనే నెపంతో మైనర్లకే ముడిపెడుతున్నారు. గ్రామాల్లో బాల్య వివాహం జరుగుతున్న విషయం చుట్టుపక్కల వారికి తెలిసినప్పటికీ మనకెందుకులే అని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. తండాల్లో అయితే, బహిరంగంగానే బాల్య వివాహాలు చేస్తున్నా.. పట్టించుకునేవారు కరువయ్యారనే విమర్శలు వస్తున్నాయి.
వ్యవస్థ ఉన్నా.. పర్యవేక్షణ సున్నా..
గ్రామ స్థాయిలో బాల్య వివాహాలను నిరోధించేందుకు స్పష్టమైన యంత్రాంగం ఉన్నప్పటికీ, జవాబుదారీతనం లోపించడమే అసలు సమస్యగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పంచాయతీ సెక్రటరీలు గ్రామంలో నిఘా వ్యవస్థగా ఉండాలి. కానీ, స్థానిక గ్రామస్తులతో ఉండే సంబంధాలు, రాజకీయ ఒత్తిళ్లు, మనకెందుకులే అనే అలసత్వం వల్ల వీరు సమాచారాన్ని పైఅధికారులకు చేరవేయడంలో విఫలమవుతున్నారు. సీడీపీవో, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, మండల విద్యాశాఖాధికారులు (ఎంఈవో), స్థానిక ఎస్ఐ పర్యవేక్షణ కూడా లోపిస్తోంది. మరోవైపు ఫిర్యాదు వచ్చాకే స్పందించే ధోరణి తప్ప, ముందస్తుగా గ్రామాలపై నిఘా పెట్టే వ్యవస్థ మండల స్థాయిలో పని చేయడం లేదు. కలెక్టర్ నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారులు కూడా పర్యవేక్షించాలి. కానీ జిల్లాల మధ్య సమన్వయం లోపించడం, క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించకపోవడం వల్ల ఈ వ్యవస్థలు విఫలమవుతున్నాయనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
కఠిన చర్యలు చేపడితేనే..
స్కూళ్లు, కాలేజీల నుంచి వరుసగా వారం రోజులకు పైగా గైర్హాజరయ్యే బాలికల వివరాలను వెంటనే ఐసీడీఎస్, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లకు ఆన్ లైన్‌లో అనుసంధానించేలా పక్కా రిపోర్టింగ్ సిస్టమ్ తేవాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రోత్సహించే పెద్దలు, పురోహితులపై బాల్య వివాహాల నిరోధక చట్టం కఠినంగా అమలు చేయాలని కోరుతున్నారు. ప్రతి గ్రామంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అధ్యక్షతన, అంగన్‌వాడీ, ఆశా, ఎస్‌హెచ్‌జీ మహిళలతో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను పునరుద్ధరించి, నెలకు ఒకసారి విధిగా సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నారు. గిరిజన తండాలు, చెంచు పెంటలు, వెనుకబడిన ప్రాంతాల్లో బేటీ బచావో- బేటీ పఢావో స్కీమ్ ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించాలని, తమ పరిధిలో బాల్య వివాహం జరిగినా సమాచారం అందించని అంగన్‌వాడీ వర్కర్లు, విలేజ్ సెక్రటరీలపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నప్పుడే క్షేత్రస్థాయి యంత్రాంగంలో భయం, బాధ్యత పెరుగుతాయని పేర్కొంటున్నారు.
బాల్యవివాహ రహిత జిల్లాగా పెద్దపల్లి
రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాను ఇప్పటికే ‘బాల్య వివాహ రహిత జిల్లా’గా ప్రకటించారు. ఇదే తరహాలో రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలను బాల్య వివాహ రహితంగా మార్చాలని, అందుకు తగ్గట్టుగా జిల్లా కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే 2026-–-27 ఆర్థిక సంవత్సరంలో బాల్య వివాహాలను కనీసం మరో 5% తగ్గించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.
