
ఆస్కార్ నామినేషన్ కు ఎన్నికైన గుజరాతీ మూవీ చెల్లో షోలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రాహుల్ కోలి చనిపోయాడు. అతని వయసు 10 సంవత్సరాలు. లుకేమియాతో బాధపడుతున్న ఆ చిన్నారి గత నాలుగు నెలలుగా అహ్మదాబాద్ క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. అక్టోబర్ 2న పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉదయం టిఫిన్ చేసిన అనంతరం తీవ్రమైన జ్వరం వచ్చిందని ఆ తర్వాత మూడుసార్లు రక్తపు వాంతులు చేసుకున్న రాహుల్ తుదిశ్వాస విడిచాడని అతని తండ్రి చెప్పాడు.
రాహుల్ కోలీ నటించిన చెల్లో షో మూవీ అక్టోబర్ 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత తమ జీవితాలు మారతాయని తమతో చెప్పేవాడని, ఆ రోజు రాకుండానే వెళ్లిపోయాడంటూ అతని తండ్రి రాము కోలి కన్నీటి పర్యంతమయ్యారు. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో భారత్ తరఫున చెల్లో షో ఎంపికైంది. భవిన్ రాబరి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావల్, పరేష్ మెహతా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను పాన్ నలిన్ డైరెక్ట్ చేశారు.