మదన్​రెడ్డి అటా.. ఇటా.. కాంగ్రెస్​లో చేరుతారని జోరుగా ప్రచారం

మదన్​రెడ్డి అటా.. ఇటా.. కాంగ్రెస్​లో చేరుతారని జోరుగా ప్రచారం
  • ఎంపీ సీటు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు
  • పార్టీలోకి రానివ్వమంటూ స్థానిక నేతల ఆందోళన

మెదక్, కౌడిపల్లి, వెలుగు: బీఆర్ఎస్ కు చెందిన మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయం సోషల్ మీడియాలో, టీవీ ఛానెల్స్​లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడైన మదన్ రెడ్డి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆయన పోటీకి సిద్ధంగా ఉన్నప్పటికీ పార్టీ హైకమాండ్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. 2019 లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో మదన్ రెడ్డి నారాజ్ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్ సభ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇస్తామని హైకమాండ్​పెద్దలు హామీ ఇవ్వడంతో ఆయన శాంతించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి గెలుపునకు కృషి చేశారు.

ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్ సభ  స్థానంలో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ఛాన్స్ ఇస్తుందని ఆశించినా మదన్ రెడ్డికి మళ్లీ నిరాశే ఎదురైంది. లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట రామిరెడ్డికి అవకాశం ఇవ్వడంతో మదన్ రెడ్డి పార్టీ హైకమాండ్ ​తీరుపై గుస్సాగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్ కు రాం రాం చెప్పాలనుకుంటున్నట్టు తెలిసింది.

ఈ మేరకు రెండు రోజులుగా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మంగళవారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో చర్చలు జరిపినట్టు తెలిసింది. మెదక్ లోక్ సభ స్థానంలో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కాగా కాంగ్రెస్ అభ్యర్థిత్వం పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్​కోసం మదన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ లీడర్ల అభ్యంతరం

బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడాన్ని తాము అంగీకరించమని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగాపని చేసి పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమై ఇప్పుడు పార్టీ లోకి వస్తామంటే ఎలా అంగీకరిస్తామని అంటున్నారు. మదన్ రెడ్డి చేరిక విషయంలో పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి పార్టీ నాయకులు కట్టుబడి ఉండాల్సిందేనని కాంగ్రెస్ ముఖ్య నాయకుడు ఒకరు చెప్పినట్టు తెలిసింది. 

చేరాలనుకుంటే బాజాప్తా చేరుతా

తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు నిజం కాదని అవన్నీ అసత్య ప్రచారాలనీ నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన  కౌడిపల్లిలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో జరిగిన ఓ పార్టీకి తాను వెళ్లగా, అదే ఫంక్షన్ కు  మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వచ్చారని చెప్పారు. అనుకోకుండా తాము అక్కడ కలిశామని, ఆ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్, ఇతర అభివృద్ధి పనుల గురించి మాట్లాడడం జరిగింది కానీ కాంగ్రెస్ లో చేరుతానని చెప్పలేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ లో చేరాలి అనుకుంటే ఎవరికీ భయపడాల్సిన పనిలేదని బాజాప్త చేరుతానని తెలిపారు.  

మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి