- ఆలయ ప్రాంగణం, పరిసరాలు పరిశీలించిన తనికెళ్ల కన్సల్టెన్సీ
- కాటేజీలు, క్యూలైనట్ల నిర్మాణానికి చర్యలు
- రూ.147 కోట్లు అవసరం అవుతాయని అంచనా
మెదక్, పాపన్నపేట, వెలుగు: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క, సారక్క, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రామ చంద్రస్వామి ఆలయాలను రూ. వందల కోట్ల అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అదే తరహాలో ఏడుపాయలపై దృష్టి సారించింది.
పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయలకు ఏడాది పొడువునా తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. మహాశివ రాత్రికి మూడు రోజులు పాటు వైభవంగా జరిగే జాతరను రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్గా నిర్వహి స్తోంది. జాతరకు దాదాపు పది లక్షల మంది భక్తులు వస్తారు. దసరా సందర్భంగా తొమ్మిది రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం 20 నుంచి 30 వేల మంది వరకు వస్తారు.
ఇతర సెలవు రోజుల్లో, సమ్మర్హాలిడేస్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. కానీ ఏడుపాయలలో భక్తులకు సరైన సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. దాతలు నిర్మించిన సత్రాలు, షెడ్ లు మినహా భక్తులు బస చేసేందుకు వసతి సౌకర్యాలు లేవు. దీంతో ఎండకు , వానకు , చెట్ల కింద, బండరాళ్ల చాటున, కిరాయి టెంట్ల కింద బస చేయాల్సిన పరిస్థితి ఉంది. స్నాన ఘట్టాలు, తాగునీరు, టాయిలెట్ల సమస్య ఉంది. పార్కింగ్ సదుపాయం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి రాక
ఆలయ చరిత్రలో తొలిసారిగా 2025 డిసెంబర్ 25వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా రోడ్డు నిర్మాణం కోసం రూ.35 కోట్లు మంజూరు చేశారు. ఏడుపాయలను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఆ సందర్బంగా తెలిపారు. ఆ తర్వాత మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావ్ సైతం పలు మార్లు ఏడుపాయల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు తెలిపారు.
ఈ క్రమంలో ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం హైదరాబాద్ కు చెందిన తనికెళ్ళ ఇంటిగ్రేటెడ్ కన్సల్టెన్సీ సభ్యులు ఏడుపాయల ఆలయ ప్రాంగణం, పరిసరాలను వరిశీలించారు. ఏడుపాయల్లో భక్తుల కోసం కాటేజిలు, క్యూలైన్లు, ఒడి బియ్యం కౌంటర్, బోనాల మంటపం, అద్దాల మేడ తదితర నిర్మాణాలు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవి, ప్రాజెక్ట్ మేనేజర్ రవి తెలిపారు. ఏడుపాయలను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకోసం రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ అమలు కోసం రూ.147 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసినట్టు ఆలయ ఈవో వీరేశం తెలిపారు.
నీటి మూటగానే కేసీఆర్ హామీ
ఏడుపాయలను అభివృద్ధి చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నీటి మూటగానే మారింది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికి ఏడుపాయలను అభివృద్ధి చేయాలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టతో పాటు, ఏడుపాయల, వనదుర్గా ప్రాజెక్ట్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చదిద్దేందుకు రూ.1,500 కోట్లు మంజూరు చేస్తామని, అందులో నుంచి రూ.100 కోట్లు ఏడుపాయలకు కేటాయిస్తామని 2023లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఆ తర్వాత అప్పటి మంత్రి హరీశ్ రావ్ సైతం పలు మార్లు అదే విషయాన్ని చెప్పారు. ఆ నిధులతో ఏడుపాయల్లో భక్తులకు మౌలిక వసతులు మెరుగుపర్చడం తోపాటు, భక్తులు, పర్యాటకుల కోసం కాటేజీలు నిర్మిస్తామని, గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు చేస్తామని, గ్రీనరీ డెవలప్ చేస్తామని, ప్లే ఏరియా, వ్యూపాయింట్లు, పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తామని, ఘనపూర్ ఆనకట్ట ప్రాంతాన్ని టూరిస్ట్ ప్లేస్ గా డెవలప్ చేస్తామని చెప్పారు. అయితే ఆ హామీ మాటలకే పరిమతం అయ్యింది. నిధులు మంజూరు కాలేదు. పనులు జరగలేదు.
