భారత్ సరిహద్దుల్లో చైనా సైలెంట్ నిర్మాణాలు..టిబెట్ లో డ్రోన్ టెస్టింగ్ సెంటర్

భారత్ సరిహద్దుల్లో చైనా సైలెంట్ నిర్మాణాలు..టిబెట్ లో డ్రోన్ టెస్టింగ్ సెంటర్
  • బార్డర్​లో చైనా డ్రోన్ టెస్టింగ్ సెంటర్..భారత్​కు దగ్గరగా టిబెట్​లో నిర్మాణం
  • యూఎస్ ఎయిర్ ఫోర్స్ సంస్థ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: ఐదేండ్ల క్రితం లడఖ్ లోని గల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత బార్డర్ లో ఉద్రిక్తతలు రేగకుండా చైనా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నా.. సైలెంట్ గా కీలక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడుతోంది. ఇప్పటికే ఇటు లడఖ్, అటు అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ కు సమీపంలో ఎయిర్ బేస్ లు, ఆర్మీ స్థావరాలను నిర్మించిన చైనా.. తాజాగా టిబెట్ లోని ఎత్తయిన ప్రాంతంలోనూ మరో ఎయిర్ బేస్ లో నిర్మాణాలు చేపట్టినట్టుగా శాటిలైట్ ఫొటోలతో వెల్లడైంది. 

ఇండియా బార్డర్ కు దగ్గరగా టిబెట్ లో 4,300 మీటర్ల ఎత్తులో ఉన్న ఎన్ గరి పీఎల్ఏ లాజిస్టిక్ సెంటర్ వద్ద కొత్తగా డ్రోన్ టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసుకున్నట్టు అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన ‘చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇన్ స్టిట్యూట్’ ఓ నివేదికలో వెల్లడించింది. 2017లో డోక్లామ్ వద్ద, 2020లో గల్వాన్ లోయలో ఇండియాతో ఘర్షణల తర్వాత చైనా సైలెంట్ అయినట్టు కనిపిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా బార్డర్ లో వరుసగా నిర్మాణాలు చేపడుతోందని ఈ నివేదిక తెలిపింది. 

‘‘ఎన్ గరి బేస్ వద్ద 720 మీటర్ల రన్ వే, ఆర్మీ వెహికల్స్, విమానాలు నిలిపేందుకు నాలుగు హ్యాంగర్లు, భవనాలు కూడా ఉన్నాయి. టిబెట్ లోని ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా చైనా సైనికులకు రవాణా, మిలిటరీ కార్యకలాపాల నిర్వహణ చాలా కష్టమవుతుంది. అందుకే అక్కడ చైనా తన సైనికుల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటోంది.

 ప్రతికూల వాతావరణంలోనూ డ్రోన్ లను వినియోగించేందుకు వీలుగా ప్రత్యేక టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేసింది. అలాగే ఎయిర్ బేస్ కు కరెంట్ సరఫరా, చలివాతావరణంలో ఆర్మీ వెహికల్స్ ఇంజన్ లు పాడవకుండా ప్రత్యేక హ్యాంగర్లు, ఇతర సౌలతులను సిద్ధం చేసుకుంటోంది” అని నివేదికలో పేర్కొన్నారు.