తైవాన్ చుట్టూ యుద్ధ మేఘాలు : 20 నౌకలు, 22 విమానాలు మోహరింపు

తైవాన్ చుట్టూ యుద్ధ మేఘాలు : 20 నౌకలు, 22 విమానాలు మోహరింపు

చైనా, తైవాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. తైవాన్ విషయంలో చైనా తన దూకుడును మరింత పెంచింది.  ఇందులో భాగంగా 24 గంటల్లో తైవాన్ భూభాగంలోకి చైనాకు చెందిన 22 సైనిక యుద్ధ విమానాలు, 20 యుద్ధ నౌకలు ప్రవేశించాయి. ఈ మేరకు తైవాన్ ప్రకటించింది. వీటిలో 13 యుద్ధ విమానాలు తైవాన్, చైనా మధ్య సరిహద్దు రేఖను కూడా దాటినట్లు  ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తైవాన్ కు 70 మైళ్ల దూరంలో షాన్ డాంగ్ నేతృత్వంలో చైనా నౌకా దళాన్ని మొహరించిందని తైవాన్ పేర్కొంది. 

తైవాన్ సమీపంలోకి చేరుకున్న చైనా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు..తైవాన్ చైనా జలసంధి పరిసరాల్లో యుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తాయని చైనా మీడియా వెల్లడించడం గమనార్హం. 

గతవారం తైవాన్ జలసంధి ద్వారా అమెరికా, కెనడా యుద్ధ నౌకలను నడిపాయి. . USS రాల్ఫ్ జాన్సన్, రాయల్ కెనడియన్ నేవీ యొక్క హాలిఫాక్స్-క్లాస్ ఫ్రిగేట్ HMCS ఒట్టావా జలసంధి గుండా ప్రయాణించాయి. అయితే  చైనా  వీటిని 'రెచ్చగొట్టే చర్యలు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ అమెరికా మాత్రం'నావిగేషన్ స్వేచ్ఛ' ప్రయత్నాలలో భాగమని పేర్కొంది. 

చైనా- తైవాన్ వివాదం

చైనాతో తైవాన్ మధ్య ఎన్నో ఏండ్ల నుంచే వివాదాలు కొనసాగుతున్నాయి. 1683లో క్వింగ్  రాజవంశం తైవాన్‌ను తమ నియంత్రణలోకి తీసుకుంది. కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో తైవాన్ పేరు మొదటి చైనా-జపాన్ యుద్ధం 1894 తర్వాత  బయటకు వచ్చింది. ఈ యుద్ధంలో చైనా క్వింగ్ సామ్రాజ్యాన్ని ఓడించిన జపాన్.... తైవాన్‌ను ఆక్రమించింది. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయింది. దీంతో యుద్ధ సమయంలో మిత్రరాజ్యాల పక్షం వహించిన చియాంగ్ కై-షెక్ నేతృత్వంలోని చైనీయులకు తైవాన్‌ను తిరిగి ఇచ్చారు. 1949లో చియాంగ్‌తో పాటు అతని పార్టీ, కుమింటాంగ్ చైనాలో అంతర్యుద్ధాన్ని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో చియాంగ్.. మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయారు. అనంతరం చియాంగ్ వర్గం వారు తైవాన్‌కు పారిపోయి.. ఆ ప్రాంతంపై పరిపాలనా నియంత్రణను కొనసాగించారు. మావో తైవాన్‌పై దాడి చేయాలని నిర్ణయించిన తరుణంలో.... 1950లో కొరియాతో యుద్ధం చేయాల్సి వచ్చింది. దీంతో మావో ఉత్తర కొరియాలోని కమ్యూనిస్టులకు సహాయం చేయడంపై దృష్టిపెట్టారు. ఫలితంగా అప్పట్లో తైవాన్‌పై దాడిని విరమించుకున్నారు. ఈ క్రమంలో తైవాన్ భద్రత, స్వతంత్య్రానికి అమెరికా హామీ ఇచ్చింది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో  ఆ తరువాత కూడా తూర్పు ఆసియాలో చైనా ప్రాబల్యాన్ని నిరోధించడానికి అమెరికా పావులు కదిపింది. ఈ క్రమంలో తైవాన్‌కు మిత్రదేశంగా మారింది.