బీజింగ్: హార్మూజ్ జలసంధిని వీలైనంత త్వరగా తిరిగి తెరవాలని చైనా బుధవారం ఇరాన్‌ను కోరింది. బీజింగ్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో జరిగిన చర్చల్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడారు. హార్మూజ్ జలసంధిలో సురక్షితమైన నౌకాయానాన్ని పునరుద్ధరించాలనేది అంతర్జాతీయ సమాజం బలమైన కోరిక అని, దీనికి ఇరాన్ సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. అలాగే, అణు ఆయుధాలను తయారు చేయబోమన్న ఇరాన్ నిర్ణయాన్ని చైనా స్వాగతించింది. అయితే, శాంతియుత అవసరాల కోసం అణు ఇంధనాన్ని వాడుకునే హక్కు ఇరాన్‌కు ఉందని వాంగ్ యీ స్పష్టం చేశారు.
ఇరాన్ తన అణు నిల్వలను అప్పగించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, హార్మూజ్ జలసంధి సమస్యను త్వరగా పరిష్కరించడానికే తమ ప్రాధాన్యత అని అరాగ్చీ తెలిపారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూనే, శాంతి చర్చల ద్వారా శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, పశ్చిమాసియా దేశాలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని, అమెరికాపై ఆధారపడటం తగ్గించాలని చైనా సూచించింది.
గల్ఫ్ దేశాల మధ్య మెరుగైన సంబంధాల కోసం చైనా తన మద్దతును ప్రకటించింది. ఈ నెల 14, -15 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధానికి ముగింపు పలకాలని రెండు దేశాలు భావిస్తున్నాయి.
