- 17శాతం పడిపోయిన జననాల రేటు, పదేండ్లలో కోటి తగ్గిన జననాలు
- వరుసగా నాలుగో ఏడాది కూడా పడిపోయిన పెరుగుదల
బీజింగ్: ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన చైనాలో జనాభా పెరుగుదల తగ్గుతోంది. నాలుగేండ్లుగా పెరుగుదల రేటు తగ్గుతుండగా, 2025లో జననాల సంఖ్య గతంలో ఎప్పుడూ లేనంత కనిష్ట సంఖ్యకు పడిపోయింది. కిందటేడాది దేశ మొత్తం జనాభా 140.83 కోట్లుండగా, ఈ ఏడాది 140.49 కోట్లుగా నమోదైంది.
అంటే, దేశ జనాభా 34 లక్షలు తగ్గిపోయింది. 2015తో పోలిస్తే పదేండ్లలో జననాల సంఖ్య కోటి తగ్గిపోయింది. సోమవారం చైనా జాతీయ గణాంక వ్యవస్థ దేశవ్యాప్త జనాభా రిపోర్టును విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం 2025లో దేశవ్యాప్తంగా కేవలం 79 లక్షల మంది శిశువులు జన్మించారు. ఇది కిందటేడాది 2024 జననాల సంఖ్య 95.4 లక్షలతో పోలిస్తే 17 శాతం తగ్గుదల నమోదైంది.
1949 నుంచి రికార్డులను పరిశీలిస్తే.. అత్యంత తక్కువ జననాల సంఖ్య నమోదైన ఏడాదిగా 2023 రికార్డు కొట్టింది. ఆ రికార్డును ఈ ఏడాది 2025 తిరగరాసింది. అయితే, ఆర్థిక నిపుణులు దీనిని ప్రతికూల అంశమని అంటున్నారు. చైనా గతంలో పాటించిన సింగిల్ చైల్డ్ విధాన ప్రభావంతోనే జననాల సంఖ్య పడిపోయిందని చెప్తున్నారు.
ఈ ప్రభావాన్ని అంచనావేసి 2016 లోనే ఈ విధానానికి చైనా స్వస్తి పలికింది. ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతించింది. అయితే, పెరిగిన ఖర్చుల కారణంగా చాలా మంది పిల్లలను కనేందుకు ఇప్పటికీ ఇష్టపడడంలేదు.
పెరుగుతున్న వృద్ధుల సంఖ్య
చైనాలో వృద్ధుల సంఖ్య ఏటా వేగంగా పెరుగుతోంది. 2024 చివరినాటికి 60 ఏండ్లుదాటినోళ్లు 31 కోట్లకు చేరుకున్నారు. 2035 వరకుఈ సంఖ్య 40 కోట్లు దాటొచ్చని అంచనా. జనాభా పెరుగుదల రేటులో క్షీణత ఇలాగే కొనసాగితే 2100 నాటికి చైనా జనాభా 63.3 కోట్లకు పడిపోతుందని యునైటెడ్ నేషన్స్ అంచనావేసింది.
చైనాలో మరణాల రేటు కూడా ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 1.13 కోట్ల మంది చనిపోగా మరణాల రేటు 8.04(ప్రతి వెయ్యి మందికి)గా నమోదైంది. గత 50 ఏండ్లలో ఇదే అత్యధికమని రిపోర్టు వెల్లడించింది.
