ఇండియాలో ఐఫోన్ల తయారీకి బ్రేక్ వేసేందుకు చైనా కుట్ర : టెక్నీషియన్స్‌ను వెనక్కి పిలిచిన Foxconn

ఇండియాలో ఐఫోన్ల తయారీకి బ్రేక్ వేసేందుకు చైనా కుట్ర : టెక్నీషియన్స్‌ను వెనక్కి పిలిచిన Foxconn

iPhone Making: ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ హఠాత్తుగా భారత ఐఫోన్ ఉత్పత్తి ప్లాంట్లలో పనిచేస్తున్న చైనా ఇంజనీర్లను వెంటనే తిరిగి చైనా వచ్చేయాలని ఆదేశించింది. దీంతో దాదాపు 300 మంది కర్ణాటక, తమిళనాడు ప్లాంట్ల నుంచి వెనక్కి వెళ్లిపోతున్నారు. వీరిని వెనక్కి తీసుకెళ్లే ప్రణాళిక దాదాపు రెండు నెలల కిందటే స్టార్ట్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం కేవలం తైవాన్ నుంచి వచ్చిన సపోర్ట్ ఇంజనీర్లు మాత్రమే భారత ప్లాంట్లలో కొనసాగుతున్నారు. 

ఐఫోన్ల తయారీకి ప్రస్తుతం కేంద్ర బిందువుగా భారత్ మారుతున్న సమయంలో చైనా కుట్రలకు దారితీసింది. మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్ ఇండియాకు వస్తున్న తరుణంలో టెక్నాలజీ ట్రాన్స్ ఫర్, ప్రత్యేక ఎక్విప్మెంట్ భారతదేశానికి అందకుండా నివారించేందుకు ప్రస్తుతం చైనా ప్రయత్నిస్తోంది. ఈ చర్యల ద్వారా చైనా నుంచి ఉత్పత్తిని ఇతర దక్షిణాసియా దేశాలకు కంపెనీలు మార్చకుండా ఆపాలని చైనా చూస్తోంది. మార్పు చాలా ఖరీదైనదిగా ఉంటుందనే ఫీలింగ్ వారిలో తెప్పించి చైనాలోనే కొనసాగేలా చేయాలని జిన్ పింగ్ ప్రభుత్వం చూస్తోంది. 

గడచిన కొన్ని వారాలుగా చైనా నుంచి భారత కంపెనీలు చేస్తున్న ఎక్విప్మెంట్ దిగుమతులను, ప్రత్యేక యంత్రాలను టెక్నికల్ కారణాలు చూపుతూ చైనా ఆలస్యం చేస్తోంది. అలాగే కొన్ని కంపెనీలు ఇండియాకు మాత్రం తమ ఉత్పత్తులను అమ్మమని తేల్చి చెప్పేస్తున్న క్రమంలో చైనా తన ఇంజనీర్లను భారత ఆపిల్ ఉత్పత్తి ప్లాంట్ల నుంచి వెనక్కి రమ్మనటం ఆందోళనలు పెంచుతోంది. అలాగే ఫాక్స్ కాన్ కూడా స్థానిక ఉద్యోగుల ట్రైనింగ్ కోసం చైనా టెక్నీషియన్లను ఇంజనీర్లను వాడటాన్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.

భారత్ ప్రస్తుతం ప్రపంచంలో విక్రయిస్తున్న ఐఫోన్లలో 20 శాతం ఉత్పత్తి చేయటం, అలాగే అమెరికాకు వెలుతున్న ఆపిల్ వస్తువులు ట్రంప్ టారిఫ్స్ తర్వాత పెరగటంతో చైనా కొత్త కుట్రకు ప్లాన్ చేసింది. దీనికి తోడు మోటోరోలా, శాంసంగ్ సహా మరిన్ని కంపెనీలు కూడా ఇండియాలో ఉత్పత్తి చేస్తుండటం చైనాకు అస్సలు మింగుడు పడటం లేదు. ఈ క్రమంలో త్వరలోనే ఆపిల్ తరన ఐఫోన్ 17 ఉత్పత్తిని భారత ప్లాంట్లలో ప్రారంభించాలని చూస్తున్న క్రమంలో చైనా తన ఇంజనీర్లను వెనక్కి పిలిపించుకోవటం భారత వృద్ధిని నెమ్మదింపచేసే కుట్రలో భాగంగా నిపుణులు చెబుతున్నారు. దీంతో భారత ప్లాంట్లలో వియత్నామ్, తైవాన్ నుంచి టెక్నీషియన్లను ఇక్కడికి పిలిపిస్తున్నారు. రానున్న కాలంలో చైనా దూకుడు కళ్లెం వేయాలంటే చైనా మెషినరీపై ఆధారపడటాన్ని తగ్గించటమే కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.