- బీసీ సబ్‌ప్లాన్ అమలుచేయాలి
- తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు
బషీర్‌బాగ్, వెలుగు: బడ్జెట్‌లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ప్రభుత్వం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు ప్రత్యేక ‘బీసీ సబ్ ప్లాన్’ అమలు చేయాలని, కనీసం రూ.50 వేల కోట్లు కేటాయించాలని కోరారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ అభివృద్ధిలో నిర్లక్ష్యం జరుగుతోందని విమర్శించారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు బాలగౌని బాల్రాజ్ గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించలేదని, కేటాయించినవి కూడా పూర్తిగా ఖర్చు చేయలేదని ఆరోపించారు.
బీసీల వాటా పెరగాలి..
పంజాగుట్ట: బీసీల హక్కుల సాధన కోసం బీసీ నాయకులను గెలిపించాలని చిరంజీవులు సూచించారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాధికారంలో బీసీల వాటా పెరగాల్సిన అవసరం ఉందని, న్యాయ రంగంలో ఓసీల ఆధిపత్యం తగ్గాలని అన్నారు. ఇటీవల రిజర్వేషన్ సీలింగ్ అంశంపై సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 26న జరిగే బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బహుజన అభ్యర్థులను గెలిపించాలని న్యాయవాదులను కోరారు. సమావేశంలో తలకొక్కుల రాజు, పొన్నం దేవరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
