మోసాలు.. దొంగతనాలు.. అసాంఘిక కార్యకలాపాలు.. చట్టవ్యతిరేక పనులు చేసే వారి భరతం పట్టాల్సిన పోలీసులే అక్రమాలు చేస్తున్న ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. గంగాధర నెల్లూరు మండలం.. జీడీ నెల్లూరులో దొంగనోట్ల కలకలం రేగింది. పోలీసుల విచారణలో చిత్తూరు ట్రాఫిక్ ఏ.ఎస్. ఐ లోక నాదం, ఏ.ఆర్ కానిస్టేబుల్ రవి దొంగనోట్ల మఠాతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు పోలీసులు వేసిన ప్లాన్ రివర్స్ అవడంతో కథ అడ్డం తిరిగింది.. అక్రమంగా రూ. 10 లక్షలు కొట్టేసేందుకు ప్లాన్ వేశారు. .. జీడి నెల్లూరు మిట్ట హరిజనవాడ కు చెందిన సెల్వం, దేవా, వేలూరు కు చెందిన ఇళంగోవన్ తో కలసి దొంగనోట్ల ముఠాతో పోలీసులు చేతులు కలిపారు.
తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన మంజు, విజయ్ లు ఇద్దరు వ్యక్తులతో ఇతను ఒక డీల్ కుదుర్చుకున్నాడు. రూ. 10 లక్షల అసలు కరెన్సీ ఇస్తే, దానికి బదులుగా రూ. 1 కోటి నకిలీ కరెన్సీ ఇస్తానని నమ్మించాడు. జీడి నెల్లూరు కు రావడంతో క్యాష్ తీసుకుని పోలీసుల మంటూ దొంగనోట్ల ముఠా మోసానికి పాల్పడింది. బాధితులు తాము కొబ్బరికాయలు కొనుగోలు చేసేందుకు వస్తే మోసం చేశారంటూ జీడి నెల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదుతో అలర్ట్ అయిన గంగాధర నెల్లూరు పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. నిందితుల మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేసి.. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగాఅక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం దొంగనోట్ల ముఠా సభ్యులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసుపై గంగాధర నెల్లూరు సీఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
