సర్తోనే ఓటరుగా గుర్తింపు : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

సర్తోనే ఓటరుగా గుర్తింపు : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, వెలుగు: సర్ ​ప్రక్రియకు సహకరించి నమోదు చేసుకుంటేనే ఓటరుగా గుర్తింపు పొందడానికి అర్హత సాధించవచ్చని కరీంనగర్ ​జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మధురానగర్​లో సోమవారం సర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సకాలంలో ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించాలని సూచించారు. 

అనంతరం మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. బీఎల్వోలు ఇప్పటికే గ్రామాల్లో ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారని, ప్రజలు సకాలంలో వాటిని నింపి బీఎల్వోలకు అందించాలన్నారు. , చొప్పదండి నియోజకవర్గంలో 80 శాతం సర్ ప్రక్రియ పూర్తయినట్లు చెప్పారు. తహసీల్దార్​ఎ.రజిత, ఎంపీడీవో రాము, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు చిరుత మంగ, సింగిల్ విండో చైర్మన్ తిరుమల్​రావు, డీసీసీ ఉపాధ్యక్షుడు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. 

గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

చొప్పదండి, వెలుగు: నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నానని మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి మండలం గుమ్లాపూర్​లో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని సోమవారం ప్రారంభించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, గుమ్లాపూర్ సర్పంచ్ లింగాల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.