న్యూఢిల్లీ: రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడిచమురు గణాంకాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించలేమని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్' (పీపీఏసీ) స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) సమర్థించింది. ఈ వివరాలను బయటపెడితే దేశ ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు, ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని కమిషన్ పేర్కొంది.
జూన్ 2022 నుంచి జూన్ 2025 మధ్య కాలంలో రష్యా నుంచి భారత్ ఎంత ముడిచమురు దిగుమతి చేసుకుంది? ఇందులో ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, రిలయన్స్, నయారా ఎనర్జీ వంటి కంపెనీల వారీగా వివరాలు ఇవ్వాలని ఓ వ్యక్తి ఆర్టీఐకి దరఖాస్తు చేశారు. దీనికి సమాధానంగా.. దేశాల వారీగా, కంపెనీల వారీగా ఇచ్చే చమురు దిగుమతుల సమాచారం వాణిజ్యపరంగా అత్యంత రహస్యమైనదని, దీనికి ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1) ప్రకారం మినహాయింపు ఉందని పీపీఏసీ అధికారులు తిరస్కరించారు. కానీ మొత్తం ముడిచమురు దిగుమతి పరిమాణం, విలువను వెబ్ సైట్ నుంచి తెలుసుకోవచ్చని సూచించారు.

