న్యూఢిల్లీ: ఫంక్షన్ హాల్లో ఓ పెండ్లి జరుగుతుండడంతో విందు భోజనం తిందామని దొంగతనంగా లోపలికి వెళ్లాడో బాలుడు.. అయితే, ఆ బాలుడిని గమనించి అక్కడున్న ఓ వ్యక్తి నిలదీశాడు. ఇది గొడవకు దారితీయగా కోపం పట్టలేక తుపాకీతో బాలుడిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. శనివారం సాయంత్రం ఢిల్లీలోని షాదారా ప్రాంతంలోని డీడీఏ మార్కెట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. షాదారాలో ఉండే బాలుడు పెండ్లి భోజనం తినేందుకు గోడ దూకి వచ్చాడు. సహచరులు వారిస్తున్నా బాలుడు పట్టించుకోలేదు.
ఫంక్షన్ లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్, బాలుడికి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ బాలుడిపై తుపాకీతో కాల్పులు జరపడంతో అతడు చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా గుర్తించారు.
అతడి నుంచి పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు. ఆ పిస్టల్ వ్యక్తిగతమా, సర్వీస్ కు చెందినదా అనేది తెలుసుకోవడానికి హెడ్ కానిస్టేబుల్ ను విచారిస్తున్నారు.
