- టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలాంటి కంపెనీలపై ఎఫెక్ట్
- ఏఐ ఆటోమేషన్తో ఉద్యోగాల్లో భారీగా కోత
- రూపాయి కూడా పతనమయ్యే ప్రమాదం
- రెండేండ్లలో 'ఘోస్ట్ జీడీపీ పరిస్థితులు
- ఎకానమీ పైపైకి.. ప్రజల ఆర్థిక పరిస్థితి పాతాళానికి..
- ఉపాధి లేక తగ్గనున్న ప్రజల కొనుగోలు శక్తి
- ఏఐకి చిప్‌లు తయారుచేసే కంపెనీలకు ఫుల్ లాభాలు
- ‘సిట్రినీ రీసెర్చ్’ సంస్థ సంచలన రిపోర్ట్
- ఏఐ వల్ల కోతలే కాదు..
- కొత్త జాబ్లూ ఉంటాయంటున్న నిపుణులు
సెంట్రల్ డెస్క్ వెలుగు: భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఐటీ రంగంపై ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ పెను ప్రభావం చూపనున్నదా? రానున్న రెండేండ్లలో పరిస్థితులు తలకిందులు కానున్నాయా? అంటే అవుననే అంటోంది అమెరికాకు చెందిన ‘సిట్రినీ రీసెర్చ్’ కంపెనీ విడుదల చేసిన ‘ద 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్’ నివేదిక. రాబోయే ఏఐ యుగం విశ్వరూపాన్ని అంచనా వేసిన ఈ నివేదిక ప్రపంచ ఐటీ రంగాన్ని, ముఖ్యంగా భారతీయ ఐటీ కంపెనీలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్ సేవల రంగంలో భారతీయ దిగ్గజ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలకు ఏఐ రూపంలో ముప్పు పొంచి ఉందని ఈ రిపోర్ట్ హెచ్చరించింది. మానవ మేధస్సుతో పనిలేకుండా ఏఐ చేసే ఆటోమేషన్ వల్ల 2028 నాటికి లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని, ఇది భారత ఐటీ ఎగుమతులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని నివేదిక స్పష్టం చేసింది. ఐటీపై ప్రభావంతో రూపాయి విలువ కూడా దారుణంగా పతనం కావచ్చని.. చివరకు భారత్ ఐఎంఎఫ్ సాయాన్ని కోరే పరిస్థితీ రావచ్చని పేర్కొంది. అంతేకాదు.. ఏఐ విప్లవంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడుతుందని, ఘోస్ట్ జీడీపీ పరిస్థితులు వస్తాయని నివేదిక హెచ్చరించింది. అంటే.. ఏఐ యుగంలో ఉత్పత్తి పెరగడంతో జీడీపీ పెరుగుతుంది కానీ క్షేత్రస్థాయిలో యువతకు ఉద్యోగాలు ఉండవని పేర్కొంది. అయితే, ప్రతి సంక్షోభం ఒక కొత్త అవకాశాన్ని కూడా తెస్తుందని.. ఏఐ పాత ఉద్యోగాలను మింగేసినా, అంతకు మించిన నైపుణ్యం కలిగిన కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని రిపోర్ట్ పేర్కొంది.
ఐటీకి ముప్పు.. రూపాయీ పతనం?
భారత ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ లాంటి కంపెనీలు గడ్డుపరిస్థితులు ఎదుర్కోనున్నాయని రిపోర్ట్ వెల్లడించింది.భారత ఐటీ రంగాన్ని ఒక భయంకరమైన సంక్షోభం చుట్టుముట్టబోతోందని నివేదిక హెచ్చరించింది. ఇప్పటిదాకా ఈ కంపెనీలన్నీ "తక్కువ ఖర్చుతో కూడిన శ్రమ" (అమెరికా డెవలపర్ల కంటే ఇండియా డెవలపర్లు తక్కువ జీతానికే దొరకడం) అనే సూత్రం మీద నడిచాయి. ఈ కంపెనీలు చేసే పనుల్లో అత్యధికంగా 'కోడింగ్', 'టెస్టింగ్', 'మెయింటెనెన్స్' వంటివే ఉన్నాయి. కానీ, ఇప్పుడు 'ఏఐ కోడింగ్ ఏజెంట్లు' కేవలం మన ఇండ్లల్లో కరెంట్ బిల్లులకు అయ్యేంత ఖర్చుతోనే ఈ పనులను పూర్తి చేస్తున్నాయి. దీంతో ఇండియన్ కంపెనీల సేవల ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది. 2027 నాటికి ఈ కంపెనీల ప్రాజెక్ట్ ఒప్పందాలు భారీగా రద్దవుతాయని.. దీనివల్ల దేశానికి వచ్చే విదేశీ ఆదాయం తగ్గిపోయి, కేవలం నాలుగు నెలల్లోనే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 18 శాతం పడిపోవచ్చని అంచనా వేసింది. ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే, 2028 నాటికి భారతదేశం ఆర్థిక సాయం కోసం ఐఎంఎఫ్ తో చర్చలు జరపాల్సి వస్తుందని పేర్కొంది.
నియంత్రణ లేని వలయం..
ఏఐ అభివృద్ధికి అడ్డుకట్ట వేసే సహజమైన బ్రేకులు లేవు. కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తీసేస్తాయి. అలా మిగిలిన డబ్బుతో మరిన్ని ఏఐ టూల్స్ కొంటాయి. దీనివల్ల మరింత మంది ఉద్యోగాలు కోల్పోతారు. ఉద్యోగాలు కోల్పోయిన జనం వస్తువులను కొనడం మానేస్తారు. దీంతో కంపెనీల అమ్మకాలు పడిపోతాయి. తమ లాభాలను కాపాడుకోవడానికి ఆ కంపెనీలు మళ్ళీ ఏఐపైనే ఆధారపడతాయి. ఇది ఒక వలయంలా మారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇదంతా నియంత్రణ లేని ఒక ఫీడ్ బ్యాక్ లూప్ లా మారిపోతుంది.
తైవాన్, సౌత్ కొరియాకు మస్త్ లాభాలు..
ఏఐ విప్లవంతో ఒకవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చితికిపోతున్నా, ఐటీ సర్వీసులు, ఇతర కంపెనీలు ప్రమాదంలో పడుతున్నా.. మరోవైపు కొన్ని రకాల కంపెనీలు మాత్రం భారీ లాభాలు గడిస్తాయని సిట్రినీ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఏఐ వ్యవస్థలకు అవసరమైన చిప్స్ తయారు చేసే ఎన్ విడియా, టీఎస్ఎమ్ వంటి కంపెనీలు భారీ లాభాల్లో ఉంటాయని అంచనా వేసింది. కంప్యూటర్ చిప్ ల తయారీలో అగ్రస్థానంలో ఉన్న తైవాన్, కొరియా వంటి దేశాలు ఈ ట్రెండ్ వల్ల లాభపడతాయని పేర్కొంది.
కంపెనీలు, ఉద్యోగులు మారాలి.. లేదంటే కష్టమే!
ఏఐని సాకుగా చూపుతూ ఈ నివేదిక పేరుతో భయపెట్టాలన్నది తమ ఉద్దేశం కాదని.. అప్రమత్తం చేయాలన్నదే తమ ఆకాంక్ష అని సిట్రినీ రీసెర్చ్ వెల్లడించింది. "ఏఐ మనుషులను భర్తీ చేయదు. కానీ, ఏఐ వినియోగం తెలిసిన మనిషి.. ఏఐ వినియోగం తెలియని మనిషి ఉద్యోగాన్ని భర్తీ చేస్తాడు" అన్నది నేటి వాస్తవమని స్పష్టం చేసింది. అయితే, భారత ఐటీ కంపెనీలు తమ బిజినెస్ మోడల్‌ను పూర్తిగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఈ నివేదికతో తేలిపోయిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘‘2028లో రాబోయే ఈ 'ఇంటెలిజెన్స్ క్రైసిస్'ను తట్టుకోవాలంటే భారతీయ ఐటీ కంపెనీలు, ఉద్యోగులు తమ పనితీరును మార్చుకోవాలి. కేవలం సర్వీస్ ప్రొవైడర్లుగా కాకుండా, ఏఐ సొల్యూషన్స్ ఇచ్చే ఇన్నోవేటర్లుగా మారాలి. మన ఇంజనీర్లు రీ-స్కిల్లింగ్ పై దృష్టి పెడితేనే ఈ ఆర్టిఫిషియల్ సునామీని తట్టుకొని నిలబడగలరు” అని స్పష్టం చేస్తున్నారు.
రెండేండ్లలో ‘ఘోస్ట్ జీడీపీ’!
సాధారణంగా దేశ జీడీపీ పెరిగితే ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. కానీ ఏఐ యుగంలో జీడీపీ పెరుగుతుంది (యంత్రాల ఉత్పత్తి వల్ల). కానీ క్షేత్రస్థాయిలో మనుషులకు ఉద్యోగాలు ఉండవు. దీనినే ‘ఘోస్ట్ జీడీపీ’ అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థలో వృద్ధి ఉన్నట్టే కనిపిస్తుంది కానీ, అది సామాన్యుడి కడుపు నింపదు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతున్న వేగం చూస్తుంటే, 2028 నాటికి అది ఒక పతాక స్థాయికి చేరుకుంటుందని సిట్రినీ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం, రాబోయే రెండేండ్లలో ప్రపంచం ఒక వింతైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోబోతోంది. ఏఐ వల్ల కంపెనీల ఉత్పాదకత పెరుగుతుంది కానీ, మానవ వనరుల అవసరం గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల ఆర్థిక వృద్ధి (జీడీపీ) కనిపిస్తుంది కానీ, అది కేవలం యంత్రాల ద్వారానే సాధ్యమవుతుంది. ఈ 'ఘోస్ట్ జీడీపీ' ఫలితంగా సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైపోతుంది. దీనివల్ల కంపెనీల లాభాలు పెరిగినా, సామాన్య ఉద్యోగులకు మాత్రం ఉపాధి కరువయ్యే ప్రమాదం ఏర్పడుతుంది.
జాబ్స్పోయే రంగాలు
- ఐటీ సపోర్ట్ ఇంజినీర్లు
- జూనియర్ కోడర్లు
- డాటా ఎంట్రీ ఆపరేటర్లు
- బీపీవో/కేపీవో
- కంటెంట్ రైటర్లు, ట్రాన్స్‌లేటర్లు
- బేసిక్ గ్రాఫిక్ డిజైనర్లు
- ఫైనాన్స్/అడ్మిన్
- కస్టమర్ కేర్
కొత్తగా జాబ్స్ వచ్చేవి
- ఏఐ ఆర్కిటెక్ట్స్
- ఏఐ ప్రాంప్ట్ ఇంజినీర్
- ఏఐ ఎథిక్స్ ఆఫీసర్
- మెషీన్ లెర్నింగ్ సైంటిస్ట్
- సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్
- హ్యూమన్ ఏఐ కొలాబరేటర్
- డేటా క్యూరేటర్స్
- ఏఐ ఆడిటర్స్
100 మంది పని ఒక్కరితోనే..
ప్రస్తుతం 100 మంది చేసే పని ఏఐ ఆటోమేషన్తో ఒక్కరే చేసే పరిస్థితి రాబోతున్నది. క్లయింట్లు తమ ఐటీ ప్రాజెక్టులకు ఇచ్చే బడ్జెట్‌ను భారీగా తగ్గించుకోబోతున్నాయి. ఎందుకంటే ఏఐ వల్ల పని సులభం కావడంతో వారు తక్కువ మొత్తంలో చెల్లిస్తారు. దీంతో ఇండియన్ ఐటీ సర్వీసుల కంపెనీల లాభాలు తగ్గిపోవడమే కాకుండా, కొత్త నియామకాలు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఇలా..
- అంశం ప్రస్తుత పరిస్థితి 2028 నాటికి పరిస్థితి అంచనా
- ఐటీ ఎగుమతులు సుమారు 200 బిలియన్ డాలర్లు ఒప్పందాల రద్దుతో భారీగా క్షీణత
- రూపాయి విలువ స్థిరంగా ఉంది 4 నెలల్లోనే 18% పతనం
- విదేశీ మారకద్రవ్యం సర్ ప్లస్ (మిగులు)లో ఉంది లోటులోకి వెళ్లే ప్రమాదం
- (ఐఎంఎఫ్ సహాయం అవసరం)
- ఉపాధి కల్పన ఐటీ ప్రధాన ఉపాధి వనరు సామూహిక లేఆఫ్స్ ముప్పు
ఏఐ వల్ల కొత్తగా వచ్చే జాబ్‌లు ఇవే..
కొత్త ఉద్యోగం బాధ్యతలు
- ఏఐ ఆర్కిటెక్ట్స్ కంపెనీలకు అవసరమైన ఏఐ వ్యవస్థలను డిజైన్ చేసేవారు
- ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్ ఏఐ నుంచి సరైన సమాధానాలు రాబట్టేలా కమాండ్స్ ఇచ్చే నిపుణులు
- ఏఐ ఎథిక్స్ ఆఫీసర్ ఏఐ వినియోగంలో నైతిక విలువలు, గోప్యతను పర్యవేక్షించే వారు
- మెషిన్ లెర్నింగ్ సైంటిస్ట్ కొత్త ఏఐ మోడల్స్‌ను అభివృద్ధి చేసే టెక్ నిపుణులు
- సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఏఐ ఆధారిత సైబర్ దాడుల నుండి కంపెనీలను రక్షించే వారు
- హ్యూమన్-ఏఐ కొలాబరేటర్ మనుషులకు, ఏఐ టూల్స్ కు మధ్య సమన్వయం చేసే మేనేజర్లు
- డేటా క్యూరేటర్స్ ఏఐ శిక్షణ కోసం భారీ మొత్తంలో ఉన్న డేటాను శుద్ధి చేసి, నిర్వహించే వారు
- ఏఐ ఆడిటర్స్ ఏఐ తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉన్నాయా? లేదా? అని పర్యవేక్షించే వారు
ఏఐ వల్ల పోయే జాబ్‌లు ఇవే..
- రంగం ప్రమాదంలో ఉన్న ఉద్యోగాలు కారణం
- ఐటీ జూనియర్ కోడర్లు, సాఫ్ట్‌వేర్ టెస్టర్లు,
- డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సపోర్ట్ ఇంజనీర్లు ఏఐ స్వయంగా కోడ్ రాయడం,
- బగ్స్ ఫిక్స్ చేయడం వల్ల
- బీపీఓ/కేపీఓ కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ,
- టెక్నికల్ సపోర్ట్, టెలిమార్కెటింగ్ ఏఐ చాట్‌బాట్స్ మనుషుల కంటే వేగంగా సమాధానాలివ్వడం వల్ల
- కంటెంట్/డిజైన్ కాపీ రైటర్లు, బేసిక్ గ్రాఫిక్ డిజైనర్లు, ట్రాన్స్‌లేటర్లు క్యాన్వా, చాట్ జీపీటీ వంటి టూల్స్
- ఈ పనులను ఈజీగా చేయడం వల్ల
- ఫైనాన్స్/అడ్మిన్ అకౌంటెంట్లు, డేటా అనలిస్టులు
- (ఎంట్రీ లెవల్), బుక్ కీపింగ్, షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ డేటాను సులభంగా విశ్లేషించడం వల్ల
