మావోయిస్టులను చర్చలకు పిలవాలి : పౌరహక్కుల సంఘం

మావోయిస్టులను చర్చలకు పిలవాలి : పౌరహక్కుల సంఘం
  • బూటకపు ఎన్​కౌంటర్​ను మోదీ, అమిత్ షా పొగడటం కరెక్ట్​ కాదు: పౌరహక్కుల సంఘం

బషీర్​బాగ్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ పాటించి, మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ కోరారు. హైదరాబాద్ హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో మంగళవారం పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో మాడ్ సమీపంలో జరిగిన మావోయిస్టు అగ్రనేత నంబాలా కేశవ రావు ఎన్ కౌంటర్ పై పౌరహక్కుల సంఘం విచారణ వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ.. మావోయిస్టు అగ్రనేత నంబాలా కేశవ రావు తో పాటు 27 మందిని కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలు మట్టుపెట్టాయని, ఈ బూటకపు ఎన్ కౌంటర్ ను ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శభాష్ అని పొగడటం శోచనీయం అని అన్నారు. 

హంతకులను మెచ్చుకొనే దశకు పాలకులు చేరుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాంతి భద్రతల అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవడం  ఫెడరల్ వ్యవస్థను కొనసాగించడమేనని అన్నారు. పౌర సమాజం మొత్తం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్న సందర్భంగా.. చర్చలు జరపకుండా ఆయుధాలతో సమాధానం చెప్తూ ఆపరేషన్ కగార్ పేరుతో 550 మందిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించినా కూడా కర్రెగుట్టలో ఏకపక్షంగా కాల్పులు జరుపుతున్నారని, చత్తీస్ గఢ్ అడవులు శవాల గుట్టలుగా మారాయని ఆయన పేర్కొన్నారు.