- వరి కోతల నేపథ్యంలో 24 గంటలూ సప్లై చేయాలి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తకుండా వెంటనే సరఫరాను 10 నుంచి 15 శాతం పెంచాలని సివిల్ సప్లయ్స్కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించారు. గురువారం సివిల్ సప్లయ్భవన్లో కంపెనీల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగి వరి కోతల నేపథ్యంలో ఇంధన కొరత లేకుండా ఆదివారాలు, సెలవు దినాలతో సహా 24 గంటల పాటు సప్లై చేయాలన్నారు.
ఎన్నికల అనంతరం ధరలు పెరుగుతాయన్న పుకార్లు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ప్రజలు ముందస్తుగా ఇంధనం కొనుగోలు చేయడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఇండస్ట్రియల్ డీజిల్(లీటర్కు రూ.150), రిటైల్ డీజిల్(రూ.95) మధ్య రేటు వ్యత్యాసాన్ని దుర్వినియోగం చేస్తూ కొందరు వ్యాపారులు రిటైల్ బంకుల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు చేయడంతో కొరత ఏర్పడినట్లు గుర్తించామన్నారు.
ఏప్రిల్ 30 నాటికి రాష్ట్రంలో రోజువారీ డీజిల్ పంపిణీ 190 శాతం పెరిగి, 21,295 కిలో లీటర్లకు చేరగా, పెట్రోల్ సరఫరా 118 శాతం పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు రోజుకు 34,170 కిలో లీటర్ల ఇంధనాన్ని సరఫరా చేస్తున్నాయని, ఇది సాధారణ సగటుతో పోలిస్తే 158 శాతం ఎక్కువని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా నో స్టాక్ బోర్డులు పెట్టకుండా చూడాలన్నారు. ప్రతి 4 గంటలకోసారి బంకుల్లో నిల్వల పరిస్థితిని సమీక్షించాలని అధికారులకు సూచించారు. జిల్లా స్థాయి కమిటీలు 24 గంటలపాటు పని చేస్తున్నాయని, ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఫోన్ చేయాలన్నారు.
