68 లక్షల టన్నుల వడ్ల కొనుగోలు ..టార్గెట్‌‌‌‌లో 90 శాతం రీచ్ అయిన సర్కార్

68 లక్షల టన్నుల వడ్ల కొనుగోలు ..టార్గెట్‌‌‌‌లో 90 శాతం రీచ్ అయిన సర్కార్
  • పోయినేడుతో పోలిస్తే 17 లక్షల టన్నులు ఎక్కువ
  • మరో వారంలో కొనుగోళ్లు పూర్తి.. మొత్తం 70 లక్షల టన్నులకు చేరే చాన్స్
  • ఇప్పటి వరకు 36 లక్షల టన్నుల సన్నొడ్లు, 32 లక్షల టన్నుల దొడ్డు వడ్లు కొనుగోలు 
  • 13.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.16,590 కోట్లు జమ 
  • సన్నొడ్లకు బోనస్ కింద రూ.926 కోట్లు చెల్లింపు

హైదరాబాద్, వెలుగు: వానాకాలం వడ్ల కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఈ సీజన్‌‌‌‌లో ఇప్పటి వరకు 68 లక్షల టన్నులకు పైగా వడ్లు కొనుగోలు చేసింది. పోయినేడాది ఇదే టైమ్‌‌‌‌ వరకు 51 లక్షల టన్నులు కొనుగోలు చేయగా, ఈసారి 17 లక్షల టన్నులు ఎక్కువగా కొన్నది. ఇక ఈసారి 80 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకోగా, అందులో దాదాపు 90 శాతం ఇప్పటికే కొనుగోలు చేసింది. కొనుగోళ్లు ప్రారంభించిన 90 రోజుల్లోనే దాదాపు 90 శాతం ధాన్యం సేకరించింది. గత అక్టోబర్ ప్రారంభం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. 

ప్రభుత్వం 8,433 సెంటర్లు ఏర్పాటు చేయగా, వీటిలో6 వేలకు పైగా (75 శాతం) కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తయింది. మరో వారం, పది రోజుల్లో కొనుగోళ్లు పూర్తయ్యే చాన్స్ ఉంది. మొత్తం 70 లక్షల టన్నులకు పైగా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కాగా, రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌‌‌‌లో రికార్డు స్థాయిలో 67.88 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దీంతో 1.48 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 80 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.22 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. రైతులు తమ అవసరాల కోసం ఉంచుకోగా మిగిలినవి కొంత వ్యాపారులు కొనుగోలు చేశారు. మిగతా ధాన్యం కొనుగోలు సెంటర్లకు వచ్చింది. 

ఆ జిల్లాల్లో ఎక్కువ.. 

వడ్ల కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 13.50 లక్షల మంది రైతులకు రూ.16,590 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మొత్తం 68 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయగా.. అందులో 36 లక్షల టన్నుల వరకు సన్నొడ్లు, 32 లక్షల టన్నుల దొడ్డు వడ్లు ఉన్నాయి. కొనుగోళ్లు జరిగిన రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో అధికారులు డబ్బులు జమ చేస్తున్నారు. ప్రభుత్వం సన్నొడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించగా, ఇప్పటికే దీని కింద రూ.926 కోట్లు రైతులకు చెల్లించినట్టు అధికారులు వెల్లడించారు. నిజామాబాద్‌, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మెదక్‌, జగిత్యాల, సిద్దిపేట, పెద్దపల్లి, యాదగిరిగుట్ట, వరంగల్, ఖమ్మం, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగాయి. 

సాఫీగా కొనుగోళ్లు..

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వడ్ల కొనుగోళ్లపై సివిల్​సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్​ రవీంద్ర.. జిల్లా కలెక్టర్లు, అధికారులతో ప్రతిరోజూ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి నిరంతరం పర్యవేక్షించారు. కమిషనర్, డైరెక్టర్లు ఎప్పటికప్పుడు రివ్యూ చేసి.. డీఎస్‌వోలు, డీఎంవోలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటవెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. తూకంలో మోసాలు, వడ్ల సంచులు, బస్తాల రవాణా తదితర అంశాల్లో ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించడంతో కొనుగోళ్లు సాఫీగా జరిగాయి.