న్యూఢిల్లీ: సీనియర్ అడ్వకేట్ హోదా కోసం ప్రయత్నిస్తున్న ఓ లాయర్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ విమర్శిస్తూ.. వ్యవస్థపై దాడి చేసేవారి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ యువతలో కొందరు వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సదరు లాయర్‌తో మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో ఉన్నవారందరూ సీనియర్ అడ్వకేట్ కావడానికి అర్హులు కావచ్చు, కానీ, మీరైతే దానికి అర్హులు కారు’ అని పేర్కొన్నారు. సదరు న్యాయవాది గతంలో ఫేస్‌బుక్‌లో చేసినట్లుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలను సీజేఐ ప్రస్తావించారు. అంతేకాకుండా, ఉద్యోగం దొరకని లేదా వృత్తిలో రాణించలేకపోతున్న కొందరు యువకులు బొద్దింకల్లా తయారవుతున్నారు.. వారిలో కొందరు మీడియా, మరికొందరు సోషల్ మీడియా, ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి ప్రతి ఒక్కరిపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు.
ఢిల్లీ హైకోర్టు ఒకవేళ సదరు లాయర్‌కు సీనియర్ అడ్వకేట్ హోదా ఇచ్చినప్పటికీ, అతని వృత్తిపరమైన ప్రవర్తనను పరిశీలించి సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
