దుబ్బాక రిజల్ట్ తర్వాతే ఎమ్మెల్సీ క్యాండిడేట్లపై క్లారిటీ

దుబ్బాక రిజల్ట్ తర్వాతే ఎమ్మెల్సీ క్యాండిడేట్లపై క్లారిటీ
  • ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తేల్చని టీఆర్​ఎస్​,  బీజేపీ, కాంగ్రెస్​
  • ప్రచారంలో జోరు పెంచిన ఇతర ఎమ్మెల్సీ అభ్యర్థులు
  • క్యాండిడేట్లెవరో తెలియకున్నా ప్రధాన పార్టీల క్యాంపెయినింగ్​

వరంగల్‍ రూరల్‍, వెలుగు: త్వరలో జరగనున్న ఉమ్మడి నల్గొండ, వరంగల్‍, ఖమ్మంతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్‍, మహబూబ్‍నగర్‍  గ్రాడ్యుయేట్‍ ఎమ్మెల్సీ ఎన్నికలకు నెలన్నర నుంచే ప్రచారం స్టార్ట్​ చేసిన ప్రధానపార్టీలు ఇప్పటికీ  తమ క్యాండిడేట్లు వీళ్లు అని ప్రకటించుకోవడం లేదు.  ఇతర పార్టీల క్యాండిడేట్లు ప్రచారంలో జోరు పెంచినా, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​పార్టీలు మాత్రం క్యాండిడేట్లను ప్రకటించకుండానే క్యాంపెయిన్‍ చేస్తున్నాయి. నల్గొండ, వరంగల్‍, ఖమ్మం జిల్లాల్లో టీఆర్ఎస్​ తరుపున పల్లారాజేశ్వర్​రెడ్డి లాంటివాళ్లు గ్రౌండ్​వర్క్​చేస్తున్నా ఇప్పటికీ ఆయన పేరును పార్టీ హైకమాండ్​ అఫీషియల్​గా ప్రకటించలేదు. దీనిపై ఆయా పార్టీల క్యాడర్​లో అయోమయం నెలకొంది. ఇటీవల స్టేట్​వైడ్​ పొలిటికల్​ హీట్​ పెంచిన దుబ్బాక ఎలక్షన్స్​ రిజల్ట్స్​ వచ్చాకే ప్రధాన పార్టీలన్నీ క్యాండిడేట్లను ప్రకటించే చాన్స్​కనిపిస్తోంది.

క్యాండిడేట్లు లేకున్నా రంగంలోకి క్యాడర్​..​

ఈ రెండు గ్రాడ్యుయేట్​ నియోజకవర్గాల నుంచి తమ పార్టీ క్యాండిడేట్లుగా ఎవరిని పోటీలో నిలపాలనే విషయంలో ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆయా క్యాండిడేట్ల పేర్లను ముందే ప్రకటిస్తే పార్టీల్లో అసమ్మతి బయటపడే చాన్స్​ ఉందని, ఇది గ్రాడ్యుయేట్ల నమోదుకు ఆటంకం కలిగిస్తుందని ప్రధాన పార్టీలు భావించినట్లు సమాచారం. అందువల్ల ప్రధాన పార్టీలైన టీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ తమ క్యాండిడేట్లను ప్రకటించకుండానే క్యాడర్​ను రంగంలోకి దింపాయి. అనుకున్నట్లే ఆయా జిల్లాల్లో గల్లీగల్లీ తిరుగుతూ డిగ్రీ పాసైనోళ్లతో ఓటరు నమోదు చేయించాయి. టీఆర్‍ఎస్‍ హైకమాండ్​అయితే ఏకంగా ఎన్నికల ఇన్​చార్జిలను  సైతం నియమించి, బాధ్యతలు అప్పజెప్పింది. ఆయా ప్రాంతాల్లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. కమిటీలు వేసి ఒక్కొక్కరికి టార్గెట్లు ఇచ్చి మరీ ఓటరు నమోదు చేయించారు. ఈ క్రమంలో ఓటరు నమోదుకు ఎన్నికల కమిషన్‍ గతంలో ఇచ్చిన గడువు నవంబర్‍ 6న ముగిసింది. ఈ గడువు పొడిగించే అవకాశం ఉంది. ఆన్‍లైన్‍, ఆఫ్​లైన్‍ ద్వారా కుప్పలుతెప్పలుగా అప్లికేషన్లు రావడంతో పోయినసారితో పోలిస్తే ఎలక్షన్లు జరిగేచోట ఏం తక్కువ లక్షన్నర నుంచి రెండు లక్షల ఓట్లు పెరిగాయి. ఇదిలా ఉండగా, ప్రత్యర్థి ఎవరనేది తెలిశాక అందుకు దీటైన క్యాండిడేట్​ను బరిలో నిలపాలనే ఆలోచన కూడా ఆయా హైకమాండ్లకు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దుబ్బాక రిజల్ట్స్​ తర్వాతే..

ఈలోపు ఈ నెల 3న జరిగిన దుబ్బాకబై ఎలక్షన్స్​స్టేట్​వైడ్​పొలిటికల్​ హీట్​ పెంచాయి. మొదట్లో తమ గెలుపు నల్లేరుపై నడకేనని  టీఆర్‍ఎస్‍ భావిస్తూ వచ్చింది. కానీ ఎలక్షన్స్​కు వారం, పది రోజుల ముందు నుంచి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ అభ్యర్థి లక్ష్యంగా జరిగిన సోదాలు, దానికి కౌంటర్​గా జరిగిన ఆందోళనలు​ కాస్తా దాడులు, ధర్నాల వరకు వెళ్లింది. విషయం రాష్ట్రం దాటి ఢిల్లీ వరకు వెళ్లడంతో స్పెషల్‍ ఆఫీసర్‍ను నియమించే దాక  పరిస్థితి వచ్చింది. అప్పటివరకు ఎన్నికల్లో ‘వార్‍ వన్‍ సైడ్‍’ అంటూ మాట్లాడిన టీఆర్‍ఎస్‍ లీడర్లు చెమటలు కక్కేలా ఓటర్ల దగ్గరకు పరుగులు పెట్టారు. దీంతో అక్కడి ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 10న దుబ్బాక రిజల్ట్స్​ రానున్నాయి. ఇందులో గెలుపోటములు, మెజార్టీ ఆధారంగా ఆయా పార్టీలు ఎలక్షన్స్​కు రెడీ అయ్యే చాన్స్​ ఉంది. అప్పటికే అనుకున్న క్యాండిడేట్లను మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది పొలిటికల్​ అనలిస్టుల మాట.

ఇతర పార్టీ అభ్యర్థుల జోరు..

గ్రాడ్యుయేట్‍ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఇంకా తమ క్యాండిడేట్లను అఫీషియల్​గా ప్రకటించలేదు. మరోవైపు ఇతర పార్టీల క్యాండిడేట్లు ప్రచారం జోరు పెంచారు. ఉమ్మడి వరంగల్‍, నల్గొండ, ఖమ్మం నుంచి ప్రొఫెసర్‍ కోదండరామ్‍తో పాటు జర్నలిస్టులుగా పనిచేసిన తీన్మార్‍ మల్లన్న, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ రాణీ రుద్రమ, వామపక్ష పార్టీల నుంచి జయసారథిరెడ్డి, పీవీ శ్రీనివాస్‍ ప్రచారంలో బిజీ అయ్యారు. నిరుద్యోగ, ప్రైవేట్​, కాంట్రాక్ట్​ ఉద్యోగ సంఘాలు, గవర్నమెంట్‍ ఎంప్లాయిస్‍ యూనియన్లను కలిసి మద్దతు అడుగుతున్నారు. గ్రాడ్యుయేట్లను ప్రభావితం చేసేవారితో  ఇంటరాక్ట్​అవుతున్నారు. ఏయే జిల్లాల్లో ఎప్పుడు క్యాంపెయిన్‍ చేయాలనేదానిపై క్యాలెండర్‍ పెట్టుకుని మరీ ముందుకు కదులుతున్నారు. కాగా, ప్రధాన పార్టీలు క్యాండిడేట్లను ప్రకటించి, వాళ్లు రంగంలోకి దిగితే గ్రాడ్యుయేట్​ఎన్నికల ప్రచారానికి మరింత ఊపు వస్తుంది.