ఇంతకీ వాళ్లిద్దరూ కలిసినట్టా..కలవనట్టా?

ఇంతకీ వాళ్లిద్దరూ కలిసినట్టా..కలవనట్టా?
  •     రైతు వేదిక ప్రారంభానికి తుమ్మలను స్వయంగా తీస్కెళ్లిన మంత్రి అజయ్
  •     శాలువా కప్పుతుండగా తిరస్కరించిన మాజీ మంత్రి
  •     పొలిటికల్​ వర్గాల్లో హాట్​టాపిక్​
  •     జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైకమాండ్​ ఆదేశాల మేరకేనని అభిప్రాయం

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో కొన్నాళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్న ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు మధ్య శుక్రవారం ఇంట్రెస్టింగ్​ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖమ్మంలో రైతు వేదిక ప్రారంభానికి తుమ్మల ఇంటికి వెళ్లిన మంత్రి అజయ్​ ముందుగా ఆయన కాళ్లు మొక్కి మరీ  రైతువేదిక ప్రారంభోత్సవానికి తీసుకెళ్లడం, అక్కడ అజయ్​ శాలువా కప్పేందుకు ప్రయత్నించగా తుమ్మల తిరస్కరించడం పొలిటికల్​ వర్గాల్లో హాట్​ టాపిక్​గా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓ వర్గం ఓట్ల కోసం హైకమాండ్​ ఆదేశాల మేరకే అజయ్, తుమ్మలను కలిశారనే టాక్​ వినిపిస్తోంది. కానీ అక్కడ పరిస్థితిని చూసినవాళ్లు మాత్రం ‘ఇంతకీ వాళ్లిద్దరూ కలిసినట్టా, కలవనట్టా’ అని చర్చించుకోవడం కనిపించింది.

ఇదీ జరిగింది..

రఘునాథపాలెం మండల కేంద్రంలో మంత్రి పువ్వాడ అజయ్​ రూ.40 లక్షల సొంత నిధులతో రైతు వేదికను నిర్మించారు. చనిపోయిన తన అన్న పువ్వాడ ఉదయ్​ స్మారకార్థం కట్టిన ఈ రైతు వేదికను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి రాగా, ఆయనను మంత్రి అజయ్​ వెంటబెట్టుకొని ఖమ్మంలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు ఇంటికి  వెళ్లారు. ముందుగా అజయ్ తుమ్మల కాళ్లకు నమస్కారం చేయగా, ఆయన పట్టనట్లే ఉండిపోయారు.  పాలేరు స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి తుమ్మల పెద్దగా బయటికి రాకున్నా, దాదాపు ఏడాది కాలంగా ఇరువర్గాల నేతలు, కార్యకర్తల మధ్య వర్గపోరు జరుగుతోంది. సోషల్ మీడియా గ్రూపుల్లో రెండు వర్గాల మధ్య కొట్లాట ఒక దశలో హైకమాండ్​ దాకా వెళ్లింది. దాదాపు ఏడాది కాలంగా మంత్రి అజయ్ తో కలిసి తుమ్మల ఎప్పుడూ వేదికను పంచుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కరోజు ముందే తుమ్మలకు ఫోన్​ చేసి రైతు వేదిక ప్రారంభానికి ఆహ్వానించిన మంత్రి అజయ్, శుక్రవారం ఏకంగా ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా వెంటబెట్టుకొని వచ్చారు. తుమ్మల రానైతే వచ్చారు గానీ ముభావంగానే ఉన్నారు. వేదిక మీద ఉన్న తుమ్మల నాగేశ్వర్​రావుకు మంత్రి అజయ్​ శాలువా కప్పేందుకు ఎంత ప్రయత్నించినా ఒప్పుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, సిద్దిపేట జిల్లా దుబ్బాక బైపోల్స్​లో ఓటమి తర్వాత హైదరాబాద్​ కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్​ హైకమాండ్​ సూచనల మేరకే తుమ్మలను మంత్రి అజయ్​ ఆహ్వానించారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్​లో ఓ వర్గం ఓటర్లను ఆకట్టుకోవడం, నాలుగైదు నెలల్లో జరగనున్న ఖమ్మం కార్పొరేషన్​ ఎన్నికలకు దృష్టిలో ఉంచుకునే ఈ రాజకీయ మార్పులు చోటుచేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.