సమస్తిపూర్: స్కూల్‌కు వెళ్తున్న ఒక విద్యార్థినిని దుండగులు తుపాకీతో కాల్చి చంపిన ఘటన బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో జరిగింది. కైజియా గ్రామానికి చెందిన ఉమేశ్ ఠాకూర్ కుమార్తె సోనమ్ కుమారి, పూసా రోడ్డులోని కస్తూర్బా విద్యాలయంలో 12వ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం ఆ విద్యార్థిని నడుచుకుంటూ స్కూల్‌కు వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పరారయ్యారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సోనమ్ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, నాలుగు బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య వెనుక అదే గ్రామానికి చెందిన ఒక యువకుడి హస్తం ఉందని బాధితురాలి తల్లి సంగీతాదేవి ఆరోపించారు. హత్యకు ముందురోజే సదరు యువకుడు తన కుమార్తెను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడని, దానికి ఆమె నిరాకరించడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్పారు.
మరోవైపు, ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎస్పీ అరవింద్ ప్రతాప్ సింగ్, ఏఎస్పీ సంజయ్ కుమార్ పాండేలు పోలీస్ బలగాలతో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
