కాంగ్రెస్లో వర్గ పోరు..ఒకరిపై ఒకరు హెచ్చరికలు, సవాళ్లు

 కాంగ్రెస్లో వర్గ పోరు..ఒకరిపై ఒకరు హెచ్చరికలు, సవాళ్లు
  • లాయలిస్టుల పేరుతో సీనియర్ల మీటింగ్​లు
  • కౌంటర్​గా రేవంత్​ వర్గం ప్రెస్​మీట్లు
  • రేవంత్​ పర్సనల్​ షో చేస్తున్నరు: జగ్గారెడ్డి
  • పార్టీలో కోవర్టులున్నరు: యువ నేతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్​ నేతల మధ్య పంచాది రోజు రోజుకు ముదురుతున్నది. పాతోళ్లు వర్సెస్​ కొత్తోళ్లు అన్నట్లుగా లీడర్లు చీలిపోతున్నారు. ఒకరిపై ఒకరు హెచ్చరికలు, సవాళ్లకు దిగుతున్నారు. రేవంత్​ను వ్యతిరేకిస్తున్న పార్టీ లాయలిస్టుల ఫోరం నేతలు ఆదివారం మరోసారి సమావేశమయ్యారు. దీనికి కౌంటర్​గా కొందరు యువ నేతలు గాంధీభవన్​లో ప్రెస్​మీట్​ పెట్టారు. పార్టీలో కోవర్టులున్నారని వారు ఆరోపించారు. కాగా,  తనను సస్పెండ్​ చేసే దమ్ము ఎవరికీ లేదని, ఒకవేళ చేస్తే రోజుకో బండారం బయటపెడతానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. రేవంత్​ పర్సనల్​ షో చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సిటీలోని ఓ హోటల్​లో సమావేశమైన లాయలిస్టు నేతలను  ప్రెస్​మీట్​ అనంతరం అద్దంకి దయాకర్​, బెల్లయ్య నాయక్​, మానవతా రాయ్​ కలిసే ప్రయత్నం చేశారు. జగ్గారెడ్డితో భేటీ అయ్యారు. తాను పార్టీలో అనుభవిస్తున్న వేదనను జగ్గారెడ్డి వారితో పంచుకున్నారు. 

ఆయన ఆవేదన తమకు అర్థమైందని, ఇతర సీనియర్​ నేతల సమస్యలు కూడా వారం, 10 రోజుల్లో పరిష్కారం అవుతాయని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 
ఏమిటీ పంచాది?
రేవంత్​కు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారని తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్​లోని కొందరు సీనియర్లు దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. పార్టీ కోసం ఏండ్లుగా పని చేసే వాళ్లకే అవకాశం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ విషయంపై కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్​లాంటి నేతలు మీడియాతో మాట్లాడారు. కొందరు లోలోపల తమ అసంతృప్తి వెళ్లగక్కారు. అధిష్టానానికి నివేదికలు కూడా పంపారు. అయితే ఇవేవీ రేవంత్​ పీసీసీ పీఠంపై కూర్చోవడాన్ని ఆపలేకపోయాయి. దీంతో కొందరు రేవంత్​కు అనుకూలంగా మారిపోగా, కొందరు సైలెంట్​ అయ్యారు. మరికొందరు మాత్రం అదే స్టాండ్​తో ఉన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి కొందరు సీనియర్​ నేతలు రేవంత్​తో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేసినా ఆయన కలుపుకుపోవడం లేదని వాళ్లు ఆరోపిస్తున్నారు. కాగా, రేవంత్​ వర్గీయులు మాత్రం.. అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నా కలవడం లేదని, పార్టీ ఫోరంలో చర్చించాల్సిన విషయాలను బహిరంగంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. 
లాయలిస్టుల ఫోరం
కాంగ్రెస్​లో పుట్టి పెరిగిన నేతలు కొందరు లాయలిస్టుల ఫోరం పేరుతో ఒక్కటయ్యారు. ఇందులో మెజారిటీ సీనియర్లే. పార్టీ పరిస్థితిపై చర్చించే పేరుతో వీరు ఈ మధ్య తరచూ కలుస్తూనే ఉన్నారు. కొంత కాలం కింద పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య ఇంట్లో వీళ్లు భేటీ అయ్యారు. దీన్ని రహస్యంగా ఉంచారు. కాగా, వారం పది రోజుల కింద మాజీ మంత్రి మర్రి శశిధర్​ రెడ్డి ఇంట్లో కలిశారు. ఈ భేటీ గురించి మీడియాకు లీక్​ అయింది. నేతలు కూడా మీడియాతో మాట్లాడారు. పార్టీ బలోపేతం గురించి చర్చించామని చెప్పినా.. అందులో రేవంత్​ తీరు, పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్​ వ్యవహార శైలిపై చర్చ జరిగినట్లు లీక్​ అయింది. హైకమాండ్​కు ఈ విషయాలను విన్నవించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ భేటీలో పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్లు​ గీతారెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్​, పొన్నాల, కోదండరెడ్డి, శ్రీధర్​బాబు, శ్యాంమోహన్​, కమలాకర్​రావు, నిరంజన్​ తదితరులు పాల్గొన్నారు. కాగా.. సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి మాత్రం రేవంత్​పై రగిలిపోతున్నారు. జగ్గారెడ్డి నియోజకవర్గంలో వేరే లీడర్​ను పెడితే గెలుపోటముల అవకాశాలు ఎలా ఉంటాయని రేవంత్​ సర్వే చేయించారని, దీన్ని జగ్గారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఆదివారం లాయలిస్టు ఫోరం నేతలు మరోసారి భేటీ అయ్యారు. వీలైనంత త్వరగా హైకమాండ్​ను కలవాలని, రేవంత్​, పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్​ మాణిక్కం ఠాగూర్​ వైఖరులపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. 
మీటింగ్​ పెట్టినోళ్లపై చర్యలు తీసుకోవాలె: యువ నేతలు
కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న టైమ్​ ఇదని, ఇలాంటి టైమ్​లో పార్టీకి అండగా ఉండకుండా కొంత మంది మీటింగ్​లు పెట్టి వ్యతిరేకిస్తున్నారని, వారిపై  చర్యలు తీసుకోవాల్సిందేనని పీసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, నేతలు మానవతా రాయ్, ఇరవర్తి అనిల్ అన్నారు.  సమస్యలు ఉంటే పార్టీ నేతలతో చర్చించకుండా మీటింగ్​లు పెట్టడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. గాంధీ భవన్​లో వీళ్లు ఆదివారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను విడగొట్టాలని టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. మంత్రి హరీశ్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ రహస్యంగా కలిశారని అ​న్నారు. కాంగ్రెస్ ఎదుగుదలను చూసి టీఆర్​ఎస్ భయపడుతోందని, కొత్త టీమ్ వచ్చాక పార్టీ బలోపేతమైందని బెల్లయ్య నాయక్ అన్నారు. జగ్గారెడ్డి, వీహెచ్ కు సమస్యలుంటే  పార్టీలో చర్చించాలని  చెప్పారు. కాంగ్రెస్​లో టీఆర్ఎస్, బీజేపీ కోవర్టులున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని మానవతరాయ్ పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిని సస్పెండ్ చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నామని అనిల్​ అన్నారు. 
సస్పెండ్​ చేస్తే.. రోజుకో బండారం బయట పెడ్తా : జగ్గారెడ్డి
పార్టీ మంచి కోసమే తాము సమావేశమయ్యామని, ఇందులో తప్పేముందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. తనకు షోకాజ్​ఇస్తే సమాధానం చెప్తానన్నారు. తనను సస్పెండ్​ చేసినా కాంగ్రెస్​కు, సోనియా, రాహుల్​కు విధేయుడిగా ఉంటానని తెలిపారు. ఏ పార్టీలో చేరబోనని, ఇండిపెండెంట్​గానే పోటీ చేస్తానన్నారు. అయితే తనను సస్పెండ్​ చేసే అధికారం పీసీసీకి లేదని, ఒకవేళ చేస్తే రోజుకో బండారం బయటపెడ్తానని హెచ్చరించారు. తన నియోజకవర్గంలో ఎవరినైనా పోటీకి పెట్టి గెలిపిస్తానని రేవంత్​ చాలెంజ్​ చేస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్​ చేశారు. రేవంత్​ పార్టీ లైన్​లో పని చేయడం లేదని, పర్సనల్​ షో చేస్తున్నారని ఆయన ఆరోపించారు.