రివిజన్ చేయించాల్సిన టైమ్​లో క్లాసులు!

రివిజన్ చేయించాల్సిన టైమ్​లో క్లాసులు!

హైదరాబాద్, వెలుగు: టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ కు సమయం దగ్గర పడుతోంది. ఎగ్జామ్స్ నిర్వహణకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. అయితే, స్కూళ్లలో పాఠాలు పూర్తికాక, టీచర్లు లేక స్టూడెంట్లు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సిటీలోని అనేక ప్రైవేట్ స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్ల కొరత వెంటాడుతోంది. మరో నెల రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉండగా.. మేనేజ్​మెంట్లు ఇప్పుడు హడావుడి చేస్తున్నాయి. ఇతర స్కూళ్లు, బ్రాంచ్‌‌లలోని టీచర్లను రప్పించి హడావుడిగా వారితో పాఠాలు చెప్పిస్తున్నాయి. అడ్జెస్ట్​మెంట్ల మీద తీసుకొచ్చి ఇంపార్టెంట్ సిలబస్ చెప్పేలా ఒప్పందం చేసుకుంటున్నాయి. ఇన్నిరోజులు చూసీచూడనట్లు ఉండి.. స్టూడెంట్లు రివిజన్ చేసుకునేందుకు ఎంతో ముఖ్యమైన ఈ సమయంలో పాఠాలు చెప్పిస్తుండటంతో ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా రాస్తామోనని స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు. టీచర్ల సంఘాలు సైతం ఈ విషయంపై సీరియస్​అవుతున్నాయి. 

అడ్జెస్ట్ మెంట్లతో నెట్టుకొస్తూ..

కరోనా టైమ్ లో యాజమాన్యాలు చాలా మంది టీచర్లను తీసేశాయి. దీంతో వీరిలో అనేక మంది గురుకుల, డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్​అవుతున్నారు. మరి కొందరు ఇతర ఉద్యోగాలకు షిఫ్ట్ అవడంతో.. టీచర్ల కోసం ప్రస్తుతం యాజమాన్యాలు వెతుకున్నప్పటికీ దొరకడం లేదు. దీంతో డిగ్రీ, బీటెక్‌‌ చదివిన గ్రాడ్యుయేట్లను టీచర్లుగా తీసుకున్నారు. సరిపడా స్టాఫ్ లేకపోవడంతో ఉన్న వారితోనే అడ్జెస్ట్​మెంట్లు చేయిస్తున్నాయి. చాలా స్కూళ్లలో ఒకే టీచర్‌‌‌‌తో రెండు, మూడు సబ్జెక్టులు కూడా చెప్పిస్తున్నారు. పక్క స్కూళ్ల నుంచి సబ్జెక్ట్ టీచర్లను తెప్పించి పాఠాలు చెప్పిస్తున్నాయి. అయితే ఈ టైంలో సిలబస్ కంప్లీట్ చేస్తుండటంతో స్టూడెంట్ల రివిజన్ పై ప్రభావం పడుతోంది. 

 20 రోజుల్లో పూర్తిచేసేలా..

టీచర్ల కొరత కారణంగా రోజుకు నాలుగైదు పీరియడ్స్ తీసుకునే టీచర్లు ఏడెనిమిది క్లాసులు తీసుకున్నా సిలబస్​కంప్లీట్​చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని చోట్ల అసలు సబ్జెక్ట్ టీచర్లు లేకుండానే నడిపించాయి. సోషల్ సైన్స్, లాంగ్వేజ్ టీచర్లు లేకుండానే ఈ అకడమిక్ నడిపించిన మేనేజ్​మెంట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరపడుతుంటంతో కొరత ఉన్న టీచర్లను పిలిపించి 15 నుంచి 20రోజుల్లో పాఠాలు పూర్తిచేసేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఈ టైం పీరియడ్ లో సిలబస్ కంప్లీట్ చేసేయాలని, అందుకుగానూ రూ.20వేల నుంచి 30 వేల ప్యాకేజీ ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నాయని టీచర్స్ యూనియన్లు పేర్కొంటున్నాయి.

టెన్త్​ స్టూడెంట్ల మీదనే ఫోకస్..

ఒకప్పుడు ప్రైవేట్ లో 70 శాతం క్వాలిఫైడ్ టీచర్లు, 30 శాతం నాన్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అకడమిక్ ఇయర్ మొత్తం టీచర్లు లేకుండా నడిపించి ఇప్పుడు మేనేజ్ చేస్తున్నారు. ఏడాది మొత్తం జీతం ఇచ్చే అవసరం లేకుండా చివరి నిమిషంలో ఇలా పాఠాలు చెప్పిస్తున్నాయి. కేవలం పదో తరగతి పిల్లల మీద మాత్రమే దృష్టిపెడుతూ మిగతా క్లాసులను పట్టించుకోవడం లేదు. - షబ్బీర్ అలీ, అధ్యక్షుడు, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం