క్లైమేట్ చేంజ్ వల్లే.. వడగండ్ల వానలు

క్లైమేట్ చేంజ్ వల్లే.. వడగండ్ల వానలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 79 శాతం రైతు కుటుంబాలపై క్లైమేట్ చేంజ్ ప్రభావం ఉంటుందని ఈపీటీఆర్ఐ (ఎన్విరాన్​మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్) డైరెక్టర్ జనరల్ వాణి ప్రసాద్ అన్నారు. రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడడం వల్ల పంట భూములు నిస్సారంగా మారుతున్నాయన్నారు. వాతావరణ మార్పు (క్లైమేట్ చేంజ్) ప్రభావంతోనే వడగండ్ల వానలు, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణా సంస్థలో వివిధ సంస్థల జర్నలిస్టులకు రెండు రోజుల వర్క్ షాప్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్, వ్యూస్ అనే స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఈ వర్క్ షాప్​ను నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. 

వర్క్​షాప్​లో యూఎస్ కాన్సులేట్ కల్చరల్ అఫైర్స్ పబ్లిక్ డిప్లొమసీ అధికారి జొనాథన్ ఒర్, ప్రముఖ పర్యావరణవేత్తలు డాక్టర్​కె. పురుషోత్తం రెడ్డి, డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి, అమెరికాలోని మిడిల్ టెన్నెసీ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సంజయ్ ఆస్థానా, ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్, ప్రముఖ జర్నలిస్టు సతీశ్, తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యావరణ మార్పులు ఎంతటి దుష్ప్రభావాలను కలిగిస్తున్నాయో వారు వివరించారు. దేశంలోని 90 శాతం మందికి స్వచ్ఛమైన గాలి అందడం లేదని వాణి ప్రసాద్ చెప్పారు. దేశంలో ఎన్విరాన్​మెంట్ ప్రొటెక్షన్​ యాక్ట్​ను తీసుకొచ్చినా, దానిని సరిగ్గా అమలు చేసేందుకు ఎన్విరాన్​మెంట్ ప్రొటెక్షన్ అథారిటీని మాత్రం నియమించలేదని పురుషోత్తం రెడ్డి అన్నారు. 2013లో దీనిపై సుప్రీంకోర్టు కేబినెట్ సెక్రటరీకి నోటీసులిచ్చినా స్పందన లేదన్నారు.