సెన్సెక్స్ 889 పాయింట్లు జూమ్‌‌.. ఐటీ, బ్యాంక్, మెటల్ షేర్లలో భారీ కొనుగోళ్లు...

సెన్సెక్స్ 889 పాయింట్లు జూమ్‌‌.. ఐటీ, బ్యాంక్, మెటల్ షేర్లలో భారీ కొనుగోళ్లు...
  • తిరిగి 24,250 లెవెల్​ను అందుకున్న నిఫ్టీ
  • 6% పెరిగి 90 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడాయిల్‌‌
  • 16 పైసలు బలపడి 95.66 వద్ద సెటిలైన రూపాయి

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్   మళ్లీ లాభాల బాట పట్టింది. ఆసియా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, మన దలాల్ స్ట్రీట్‌‌‌‌లో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, బ్లూ-చిప్ షేర్ల జోరుతో బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌లు బుధవారం భారీగా పెరిగాయి. బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్ దాదాపు 889 పాయింట్లు పుంజుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ తిరిగి 24,250 లెవెల్‌‌ను  చేరుకుంది.  సెన్సెక్స్ ఇంట్రాడేలో 1,000 పాయింట్ల వరకు పెరిగింది. చివరికి 1.16 శాతం  లాభంతో 77,654.60 వద్ద స్థిరపడింది. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ నిఫ్టీ 264.85 పాయింట్లు (1.10శాతం) పెరిగి 24,250.20 వద్ద ముగిసింది. డాలర్‌‌‌‌‌‌‌‌తో రూపాయి విలువ 16 పైసలు బలపడి 95.66 వద్ద సెటిలైంది.

కలిసొచ్చిన  అంశాలు..

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందే దేశీయంగా బలమైన కార్పొరేట్ క్యూ1 ఫలితాలు మార్కెట్లకు అండగా నిలిచాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజాలు సత్తా చాటడంతో పాటు, మొదటి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు ప్రకటించిన ఎల్‌‌‌‌అండ్‌‌‌‌టీ షేర్లు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. విదేశీ పోర్ట్‌‌‌‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌ఐఐలు) మళ్లీ నికర కొనుగోలుదారులుగా మారడం  కలిసొచ్చింది. ఎఫ్‌‌‌‌ఐఐలు బుధవారం నికరంగా రూ.2,980 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.  

సెన్సెక్స్‌‌‌‌లో  హిందూస్థాన్ యునిలీవర్ 4.70శాతం లాభపడింది. ఇన్ఫోసిస్, ఎల్‌‌‌‌అండ్‌‌‌‌టీ, ట్రెంట్, టాటా స్టీల్, ఎయిర్‌‌‌‌టెల్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ షేర్లు కూడా లాభాల్లో కదిలాయి. మరోవైపు  అదానీ పోర్ట్స్ అత్యధికంగా 3.19శాతం క్షీణించగా, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) 1.51శాతం నష్టపోయింది. పవర్ గ్రిడ్, బీఈఎల్, ఎన్‌‌‌‌టీపీసీలు నష్టాలతో ముగిశాయి. బ్రెంట్ క్రూడ్ ధర 6 శాతం పెరిగి బ్యారెల్‌‌‌‌కు 90 డాలర్లకు చేరినా,  ఐటీ,  మెటల్ షేర్లు రాణించడంతో మార్కెట్ లాభపడింది.

మహీంద్రా ట్రక్ బిజినెస్‌‌‌‌ అమ్మకం

ఎం అండ్ ఎం తన ట్రక్, బస్ బిజినెస్‌‌‌‌ను 'ఎస్‌‌‌‌ఎమ్‌‌‌‌ఎల్ మహీంద్రా'కు రూ.525 కోట్లకు అమ్ముతున్నట్లు ప్రకటించడంతో ఎస్‌‌‌‌ఎమ్‌‌‌‌ఎల్ మహీంద్రా షేరు ఏకంగా 20% అప్పర్ సర్క్యూట్‌‌‌‌ను తాకింది. ఈ కంపెనీలో ఎం అండ్ ఎంకు 58.9 %  వాటా ఉంది.