ప్రభుత్వ బ్యాంకుల మూసివేత పుకార్లు నమ్మొద్దు

ప్రభుత్వ బ్యాంకుల మూసివేత పుకార్లు నమ్మొద్దు
  • సోషల్ మీడియా ప్రచారం అబద్ధం
  • ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన

న్యూఢిల్లీ: కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను పూర్తిగా మూసేస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఖండించాయి. ఆ రకమైన నిర్ణయమేదీ తీసుకోలేదని, అవి వట్టి పుకార్లేనని ఆర్బీఐ ప్రకటించింది.

బ్యాంకుల బలోపేతానికి కృషి

ఆర్బీఐ త్వరలో కొన్ని బ్యాంకులను మూసేయబోతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ కోరారు. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకునూ మూసివేసే ప్రశ్నేలేదని స్పష్టం చేశారు.

ఇంకా కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో బ్యాంకుల మూల ధనం పెంపుతో పాటు పలు సంస్కరణలు తీసుకొస్తోందని రాజీవ్ కుమార్ చెప్పారు.