క్లౌడ్ సీడింగ్ ట్రయల్ కంప్లీట్.. ఢిల్లీలో కృత్రిమ వర్షానికి రెడీ

క్లౌడ్ సీడింగ్ ట్రయల్ కంప్లీట్.. ఢిల్లీలో కృత్రిమ వర్షానికి రెడీ

న్యూఢిల్లీ: దీపావళి తర్వాత దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది. కాలుష్యం తీవ్రతను తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా క్లౌడ్ సీడింగ్ చేపట్టింది. ఐఐటీ కాన్పూర్‌‌ నుంచి బయల్దేరిన ఎయిర్‌‌ క్రాఫ్ట్‌‌ సిల్వర్‌‌ అయోడైడ్‌‌, అయోడైజ్డ్ సాల్ట్, డ్రై ఐస్ వంటి రసాయన ఉత్ప్రేరకాలను వివిధ ప్రాంతాల్లోని మేఘాలపై చల్లి క్లౌడ్‌‌ సీడింగ్‌‌ ప్రక్రియను పూర్తి చేసింది. 

ఢిల్లీ ప్రభుత్వం ఐదు క్లౌడింగ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించడానికి సెప్టెంబర్ 25న ఐఐటీ కాన్పూర్‎తో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ట్రయల్స్‎ను అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య ఎప్పుడైనా నిర్వహించడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతిచ్చింది. ఈ ప్రక్రియను నిర్వహించడానికి రూ.3.21 కోట్ల బడ్జెట్‌‌ అవసరమని ఢిల్లీ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రక్రియ చాలాసార్లు వాయిదా పడింది.

కృత్రిమ వర్షం అంటే

తొలుత సైంటిస్టులు కృత్రిమ వర్షానికి అనువుగా ఉన్న మేఘాలను గుర్తిస్తారు. వాటిలో సరిపడా తేమ ఉంటుంది. కానీ, వర్షం కురిసేందుకు అనువైన పరిస్థితులు ఉండవు. అలాంటి సందర్భంలో.. సిల్వర్‌‌ అయోడైడ్‌‌, పొటాషియం అయోడైడ్‌‌, డ్రై ఐస్ వంటి రసాయన ఉత్ప్రేరకాలను మేఘాలపై చల్లి క్లౌడ్‌‌ సీడింగ్‌‌ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇవి మేఘాల్లోని తేమను కరిగించి వర్షం కురిసేందుకు సహకరిస్తాయి.