కాళేశ్వరం బయల్దేరిన సీఎల్పీ టీమ్ అరెస్టు

కాళేశ్వరం బయల్దేరిన సీఎల్పీ టీమ్ అరెస్టు

భూపాలపల్లి అర్బన్, ఇల్లందు, వెలుగు: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తోందని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క విమర్శించారు. బుధవారం భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్​ను సందర్శించడానికి వెళ్తున్న సీఎల్పీ నేతలను జిల్లా కేంద్రంలోని మంజూర్​నగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తర్వాత సీఎల్పీ టీమ్​ను అరెస్ట్ చేసి గణపురం పోలీస్ ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో భట్టి విక్రమార్క సొమ్మసిల్లి పడిపోగా ఆయనకు ప్రథమ చికిత్స అందించారు.

కాళేశ్వరంతో ఉపయోగం లేదు
ప్రజా సమస్యలపై మాట్లాడితే అక్రమ  అరెస్టులు, అక్రమ కేసులు పెడుతూ టీఆర్​ఎస్​ ప్రభుత్వం రజాకర్ల పాలనను గుర్తు చేస్తోందని భట్టి మండిపడ్డారు. పోలీసు స్టేషన్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ప్రజలకు ఏం ఉపయోగం లేదని, కేవలం కమీషన్లు, కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే కట్టారని విమర్శించారు. వేల కోట్లు ఖర్చుచేసి నిర్మించిన ప్రాజెక్ట్​ కాస్త ఒక్క వరదకే కొట్టుకపోయిందని, దీంతో ప్రభుత్వ నిజాయితీ, పాజెక్టు నాణ్యత ఎంత దారుణంగా ఉందో తేలిపోయిందన్నారు. సీఎల్పీ బృందాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం సరైందికాదని సీతక్క అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి తీరుతాం
ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా కాళేశ్వరం​ను సందర్శించి తీరుతామని భట్టి తెలిపారు. భూపాలపల్లిలో అరెస్టు చేసిన సీఎల్పీ టీమ్​ను పోలీసులు రాత్రి ఇల్లందు సింగరేణి గెస్ట్​హౌస్​లో వదిలేశారు. ప్రాజెక్టులను సందర్శణకు అనుమతి తీసుకున్నా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాన్ని అణచి వేసేందుకే ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందన్నారు. తర్వాత సీఎల్పీ బృందం ఇల్లందు గెస్ట్ హౌస్ నుంచి కాళేశ్వరం సందర్శనకు బయలుదేరింది.