మోడీజీ..ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు పెట్టండి

మోడీజీ..ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు పెట్టండి

న్యూఢిల్లీ: ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఎన్నికలు వాయిదా వేయడం వల్ల ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చినట్లే అవుతుందన్నారు. దక్షిణ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, తూర్పు ఢిల్లీ కార్పొరేషన్లను విలీనం చేసే బిల్లును తెస్తామని కేంద్రం ఇదివరకే ప్రకటించడంతో ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనిపై కేజ్రీవాల్ శుక్రవారం ట్విట్టర్​లో వీడియో మెస్సేజ్ పోస్ట్ చేశారు. విలీనం చేయాలనుకుంటే ఈ ఏడేండ్లు ఏం చేశారని కేంద్రాన్ని ప్రశ్నించారు. ‘‘ఎన్నికలు పెట్టాలని ప్రధాని మోడీకి చేతులెత్తి మొక్కుతున్నా. ప్రభుత్వాలు వస్తుంటయ్. పోతుంటయ్. దేశమే ముఖ్యం. రాజకీయ పార్టీలు కాదు. మనం ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి చేస్తే ఆ వ్యవస్థ వీక్ అవుతుంది. దాంతో ప్రజాస్వామ్యం బలహీనపడ్తుంది. అది దేశానికి నష్టం” అని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం కేంద్రానికి తలవంచిందని ఆరోపించారు. ఆమ్​ ఆద్మీ పార్టీకి మద్దతు పెరిగిందని, ఎన్నికలు పెడితే ఓటమి తప్పదన్న భయంతోనే వాయిదా వేయాలని కేంద్రం.. ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి చేసిందన్నారు. కేంద్రం లేఖ రాసిన గంటలోనే ఎలక్షన్ కమిషన్ వాయిదా నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్రం లేఖ రాయడం దేశంలో ఇదే తొలిసారన్నారు.