
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఆదివారం (మే 28న) ఆసుపత్రిలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనను కేజ్రీవాల్ హత్తుకున్నారు. సత్యేందర్ జైన్ ఆరోగ్యంతోపాటు ఆయనకు అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఢిల్లీ మాజీ మంత్రి అయిన సత్యేందర్ జైన్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత ఏడాది మే నెలలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుమారు ఏడాదికి పైగా ఆయన జైలులో ఉన్నారు. అనారోగ్యానికి గురై బరువు తగ్గిన సత్యేందర్ జైన్ ఇటీవల జైలులోని బాత్‌రూమ్‌లో పడిపోవడంతో తలకు, చేతికి గాయమైంది.
ఈ నేపథ్యంలో సత్యేందర్ జైన్‌కు ఆరు వారాలపాటు మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఢిల్లీని విడిచిపెట్టి వెళ్లవద్దని, మీడియాతో మాట్లాడకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో ఏడాది తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన జైన్.. ఢిల్లీలోని లోక్ నాయక్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. తల, చేతి గాయానికి చికిత్స పొందుతున్నారు.
ఆస్పత్రిలో సత్యందర్ జైన్ ను కలుసుకున్న సందర్భంగా తీసిన ఫొటోలను కేజ్రీవాల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ధైర్యవంతుడ్ని, హీరోని కలిశాను’ అని అందులో పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రస్తుతం జైలులో డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియాకూడా ఉన్నారు. జైన్ తో పాటు సిసోడియా తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.