అధికారంలోకి వస్తే అర గంటలో హైదరాబాద్ పేరు మారుస్తాం : అస్సాం సీఎం

అధికారంలోకి వస్తే అర గంటలో హైదరాబాద్ పేరు మారుస్తాం : అస్సాం సీఎం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు కొత్త కొత్త హామీలు ఇస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ హామీలను నెరవేరుస్తాయా..? లేదా అనే విషయం పక్కన పెడితే.. తాజాగా బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి ఒకరు ఏకంగా హైదరాబాద్ పేరును మారస్తామని చెబుతున్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే అరగంటలో హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మారుస్తామని మాటిచ్చారు. 

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. చార్మినార్ వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మారుస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ఎవరూ పెద్దగా అభ్యంతరం చెప్పరని కూడా అనేశారు.

అంతేకాదు.. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) పైనా మాట్లాడారు. 2024, ఫిబ్రవరి నాటికి అస్సాంలో యూసీసీ అమల్లోకి వస్తుందని చెప్పారు. యూసీసీ అమల్లోకి వస్తే ఒక వ్యక్తి ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండేందుకు వీలుండదని అన్నారు. యూసీసీ ప్రకారం.. మరో మహిళను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి ముందుగా విడాకులు ఇచ్చిన తర్వాతే రెండో పెళ్లి చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

2023, ఫిబ్రవరిలో మహారాష్ట్రలో రెండు నగరాల పేరు మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఔరంగాబాద్ పేరును ‘ఛత్రపతి శంభాజీ నగర్’గా, ఉస్మానాబాద్ నగరానికి ‘ధరాశివ్’గా పేరు మార్చేందుకు ఓకే చెప్పింది.