కొండా వివాదంపై ఎవరూ మాట్లాడొద్దు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు CM రేవంత్ సూచన

కొండా వివాదంపై ఎవరూ మాట్లాడొద్దు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు CM రేవంత్ సూచన
  • మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం
  • ఆ విషయం హైకమాండ్ చూసుకుంటుంది
  • ప్రతి ఎమ్మెల్యే తమ సెగ్మెంట్​పై ఫోకస్ పెట్టాలి
  • సోషల్ మీడియాలో అంతా యాక్టివ్​గా ఉండాలి
  • ఆధునిక సాంకేతికను వినియోగించుకోవాలె
  • ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం తిప్పి కొట్టాలె
  • 100 సీట్లకు పైగా గెలిచి మళ్లీ పవర్​లోకి వస్తామని ధీమా
  • పార్టీలైన్ దాటిన వారిపై చర్యలుండాలి: భట్టి

హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖ విషయంలో ఇకపై ఎవరూ.. ఏమీ మాట్లాడవద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆమె విషయం పీసీసీ క్రమశిక్షణా కమిటీ, కాంగ్రెస్ హైకమాండ్ చూసుకుంటుందని స్పష్టం చేశారు. సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో మీడియా సమావేశం అనంతరం సీఎం రేవంత్ అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.

ఇప్పటి నుంచి నియోజకవర్గ సమస్యలపై దృష్టిపెట్టి, ప్రజా అవసరాలు, అభివృద్ధి పనులు గుర్తించి వాటికి తగిన నిధులను మంజూరు చేసుకోవాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, విప్‌‌‌‌‌‌‌‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, నాగరాజు, యసశ్వినీ రెడ్డి, మట్ట రాగమయి, ఎంపీ కడియం కావ్య,  ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

పార్టీ లైన్‌‌‌‌‌‌‌‌లో పనిచేయాలి

ప్రజలు ఆశించిన రీతిలో రాబోయే రెండున్నరేండ్లు ఎమెల్యేలుగా సంతృప్తికరంగా పనిచేస్తే మళ్లీ వందకు పైగా సీట్లతో రెండోసారి మనమే అధికారంలోకి వస్తామని, మన విజయాన్ని ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. పార్టీ లైన్‌‌లో పనిచేస్తే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టేది మీరేనని ఎమ్మెల్యేలనుద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియాలో ఇకనుంచి చాలా యాక్టివ్‌‌గా ఉండాలని, ఈ మధ్య వచ్చిన ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణకు బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని, తన అమెరికా టూర్‌‌‌‌ను రాజకీయ కక్షతో అడ్డుకున్న తీరును, దీంతో తెలంగాణలోని పేదలకు నాణ్యమైన విద్యను అందించడంలో ఎదురవుతున్న అవరోధాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల కోరారు.

బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ఆరోపణలను, ప్రభుత్వంపై, పార్టీపై, తనపై ఏఐని ఉపయోగించి చేస్తున్న నిరాధారమైన విమర్శలను ఎప్పటికప్పుడు సోషలో మీడియా ద్వారా ఖండిస్తూ, ప్రజలకు వాస్తవాలను వివరించాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. గత రెండున్నరేండ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసినా మనం ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలుచేస్తున్నామని, ఈ విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. 

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించొద్దు: డిప్యూటీ సీఎం భట్టి

పదేండ్లు ఎంతో కష్టపడితే కానీ మనం అధికారంలోకి రాలేదని, కానీ ఇప్పుడు ఒకరిద్దరు చేసిన తప్పులకు పార్టీ, ప్రభుత్వం మూల్యం చెల్లించే పరిస్థితి ఏర్పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అలాంటి వారిపై పార్టీపరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించవద్దని ఆయన పరోక్షంగా ఈ మధ్య జరిగిన సంఘటనను ప్రస్తావించినట్టు సమాచారం. 

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఆవేశపడకుండా, పార్టీ, ప్రభుత్వం ప్రతిష్టను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాల్సిన అవసరం ఉందని, కానీ అందుకు భిన్నంగా వ్యవహరించడం వల్ల ప్రజల్లో ఇటు పార్టీపై.. అటు ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు. ఇకనుంచి పార్టీలో ఇలాంటి సంఘటను జరగకుండా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, దీనికి అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎం తర్వాత భట్టి మినహా ఎవరూ కూడా జరిగిన పరిణామాలపై మాట్లాడలేదని సమాచారం.

సీఎంతో భట్టి, మల్లు రవి వేర్వేరుగా భేటీ

విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి వేర్వేరుగా సమావేశమయ్యారు. మంత్రి కొండా సురేఖ అంశంపై వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది.  క్రమశిక్షణా కమిటీ నివేదిక, హైకమాండ్ నిర్ణయం తదితర అంశాలు ఈ నేతల మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.