వాలంటీర్లంటే చంద్రబాబుకు కడుపులో మంట... వ్యవస్థను అవమానిస్తారా..?

వాలంటీర్లంటే చంద్రబాబుకు కడుపులో మంట... వ్యవస్థను అవమానిస్తారా..?

వాలంటీర్‌ వ్యవస్థ అంటే చంద్రబాబుకు  కడుపులో మంట అని, అందుకే నిరంతరం వారిపై దుష్ప్రచారం, విమర్శలు చేస్తూనే ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సూర్యుడు ఉదయించకముందే ఇళ్లకు వెళ్లి పెన్షన్‌ డబ్బులు చేతిలోపెట్టి.. ఆప్యాయతలు చూపించే వాలంటీర్లకు బాబు దురుద్దేశాలు ఆపాదించారని, వారు మద్యం తాగుతారని, మూటలు మోస్తారని, అల్లరి మూకలని వారిని కించపరిచారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.  

జన్మభూమి కమిటీల దోపిడి ఇంకా మర్చిపోలేదు

బాబు హయంలో జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాలు, దోపిడీ ప్రజలు ఇంకా మర్చి పోలేదని, కానీ ఆయన మాత్రం మళ్ళీ అధికారంలోకి వస్తే  వాలంటీర్ల వ్యవస్థను రద్దుచేసి  జన్మభూమి కమిటీలతో దోపిడీ సైన్యాన్ని తీసుకువస్తానని చెబుతున్నారని సీఎం జగన్ విమర్శించారు.  మంచి చేస్తున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి బ్రాండ్‌ అంబాసిడర్లే వాలంటీర్లను  జగనన్న సైన్యం వాలంటీర్లు అని అభివర్ణించారు.

వాలంటీర్ల సేవలను ప్రజలు గుర్తించారు

 విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  కోర్టులకు వెళ్లి ఈ వ్యవస్థను ఆడ్డుకోవాలని చూశారని ఆయన ఆరోపించారు. వాలంటీర్ల సేవలను ప్రజలు గుర్తించగానే,  మళ్ళీ మాట మార్చి వీరంతా జగన్‌ సైన్యం అంటూ వ్యాఖ్యలు చేశారని అన్నారు.

మోటివేటర్లుగా..

జగన్  ప్రభుత్వ ఫిలాసఫీకి ప్రతిరూపం వాలంటీర్లన్నారు. వారు చేస్తున్నది సేవే కాని  ప్రభుత్వం ఉద్యోగం పరిధిలోకి రాదని సీఎం జగన్ అన్నారు. ఇది స్వచ్చంద సేవ, ఇక్కడ పనిచేస్తున్న ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కారు. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి వాలంటీర్‌కూడా స్వచ్ఛందంగా మంచి చేయాలనే మనస్సు పెట్టి తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్న మంచి మనుషులు.  కాబట్టి..ఎవరైనా ఇది మీరు చేయాల్సిన పనికాదు  అని అంటే.. గట్టిగా సమాధానం చెప్పాలి” అంటూ వారికి ఉద్భోదించారు.  “వాలంటీర్‌ కార్యక్రమంద్వారా  మీ రాజకీయ హక్కులకు, అభ్యుదయ ఆదర్శ భావాలకు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు ఉండవన్నారు. ప్రజలందరికీ కూడా మోటివేటర్లు గా ఉంటూ  ప్రభుత్వానికి అండగా నిలబడాలని పిలుపునిస్తున్నాను” వంటూ వారికి కర్తవ్యం బోధించారు.

వాలంటీర్లకు వందనం కార్యక్రమం..

మూడో ఏడాది వాలంటీర్లకు వందనం కార్యక్రమం కింద సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులతో రాష్ర్ట వ్యప్తంగా 10 రోజుల పాటు వాలంటీర్లను సత్కరిస్తుంది. సేవా మిత్ర అవార్డు కింద 10 వేలు నగదు బహుమతి సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జితో స్కరించనున్నారు. ఈ విభాగం కింద రాష్ర్ట వ్యాప్తంగా ఈ ఏడాదిలో ఎటువంటి ఫిర్యాదులు వివాదాలు లేకుండా పనిచేసిన 2,28,624 మంది నిలిచారు. సేవా రత్న అవార్డు కింద 20 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ మెడల్ అందించనున్నారు. ఈ విభాగం కింద ప్రతి మండలంలో ఐదుగురు  మున్సిపల్ కార్పొరేషన్లలో 10 మంది ఉత్తమ వాలంటీర్లగా పనిచేసిన 4,220 మంది నిలిచారు. సేవా వజ్ర అవార్డు కింద 30 వేల నగదు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ అందించనున్నారు. ఈ విభాగం కింద 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ఐదుగురు  వాలంటీర్లు అనగా మొత్తం 875 మంది నిలిచారు. ప్రతి ఇంటికీ ఎక్కువసార్లు వెళ్లాలని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను వారికి చూపించాలని విజ్ఞప్తి చేశారు. చేసిన మంచిపై ప్రజలు ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత మీదే అంటూ వారికి స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేసి జన్మభూమి కమిటీలు తెస్తామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇన్ని దుష్ట కోణాల మధ్య నమ్ముకున్నది దేవుడి దయ ప్రజల ఆశీస్సులు, వాలంటీర్ల తోడ్పాటే అని సీఎం జగన్ పేర్కొన్నారు.