- డ్రాఫ్ట్ లిస్టుపై అభ్యంతరాలు
- మంచిర్యాల కార్పొరేషన్ లో డివిజన్లు మారిన ఓట్లు
- సవరణ కోసం వినతులు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో ఈనెల 1న జారీ చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు తప్పుల తడకగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ లిస్టు ఆధారంగా పబ్లిష్ చేసిన ఈ జాబితాలో పోలింగ్ స్టేషన్ల వారీగా అనేక తప్పులు దొర్లాయి. మంచిర్యాల కార్పొరేషన్లో ఒక డివిజన్ లోని ఓట్లు మరో డివిజన్లో, ఒక పోలింగ్ బూత్ పరిధిలోని ఓట్లు మరో బూత్‌లో చేరాయి. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో డ్రాఫ్ట్ లిస్టుపై అభ్యంతరాలు వెలువెత్తుతున్నాయి. ఓటర్ లిస్టులో తప్పులను సవరించాలని కోరుతూ విజ్ఞప్తులు వస్తున్నాయి.
సవరణకు అవకాశం
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం గత సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సవరణ చేపడుతున్నారు. డిసెంబర్ 30న పోలింగ్ స్టేషన్ల డేటా సవరణ, 31న పోలింగ్ స్టేషన్ వారిగా పునర్వ్యస్థీకరణ, జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, 4 వరకు అభ్యంతరాల స్వీకరణ, 5న రాజకీయ పార్టీ ప్రతినిధులతో మీటింగ్, 6న జిల్లాస్థాయిలో ఎన్నికల అధికారులతో మీటింగ్, 10న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. మందమర్రి మున్సిపాలిటీ ఏజెన్సీ ఏరియాలో ఉన్నందున ఈసారి కూడా ఎన్నికలు జరగడం లేదు.
అభ్యంతరాలు.. భారీగా వినతులు
మున్సిపాలిటీల్లో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుపై శుక్రవారం నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చిన వాటిలో కొన్ని పరిశీలిస్తే.. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 37వ డివిజన్ లో హౌజ్ నంబర్ 6-1 నుంచి 6-25 వరకు గల ఓట్లు 36 డివిజన్లో పడ్డాయి. వాటిని 37వ డివిజన్లో చేర్చాలని కోరుతూ నస్పూర్ ఫ్లడ్ కాలనీకి చెందిన ఎండీ ఖాలీద్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. మంచిర్యాల హైటెక్ సిటీ కాలనీలోని పలు ఇండ్లు 52వ డివిజన్ పరిధిలోకి వస్తాయి. కానీ వారి ఓట్లు మాత్రం 21వ డివిజన్ పరిధిలో చూపుతున్నాయి.
తమ ఓట్లను 52వ డివిజన్లో చేర్చాలని 12 మంది వినతిపత్రం అందజేశారు. అలాగే మంచిర్యాల కార్పొరేషన్ 42వ డివిజన్ డీలిమిటేషన్ లిస్టులో 2,700 ఓట్లు రాగా, డ్రాఫ్ట్ లిస్టులో మాత్రం 1,800 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ లిస్టులో బై నంబర్లు మిస్ కావడంతో ఓట్లలో భారీగా తేడా వచ్చినట్టు ఎడ్లవాడకు చెందిన వంగల రమేశ్ అభ్యంతరం లేవనెత్తారు. సవరించాలని కోరారు. ఇలా మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో అభ్యంతరాలు వస్తున్నాయి.
ఓటర్ లిస్టు మ్యాపింగ్ చేస్తున్నాం
ఓటరు జాబితా సవరణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ జాబితాలో కరెక్షన్స్ చేపడుతున్నాం. ఓటర్ లిస్టు మ్యాపింగ్ చేస్తూ తప్పులను గుర్తించి సవరణలు చేపడుతాం. - సంపత్ కుమార్ మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్
