త్వరలో నేతన్నలకు రూ.5 లక్షల బీమా స్కీమ్

త్వరలో నేతన్నలకు రూ.5 లక్షల బీమా స్కీమ్
  • రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ప్రకటించిన సీఎం కేసీఆర్

సిరిసిల్ల: ‘చేనేతల ఆత్మహత్యలు తగ్గించేందుకు, వాళ్లకు పని కల్పించే ఉద్దేశంతో బతుకమ్మ చీరల స్కీమ్ తెచ్చాం. కానీ దానిని కూడా కొందరు రాజకీయం చేశారు. అటు పేదలకు మంచి చీరలు అందించడంతో పాటు నేతన్నల ఆర్థిక కష్టాలు కూడా తీర్చాలనే బతుకమ్మ చీరల పథకం ప్రారంభించాం’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన  పర్యటించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేతలకు బీమా స్కీమ్ ప్రకటిస్తామన్నారు. రెండు మూడు నెలల్లోనే ఈ స్కీమ్ తెచ్చి ఎక్కడైనా నేతన్న మరణిస్తే రూ.5 లక్షలు అందిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇతర కుల వృత్తుల వాళ్లకు చేసినట్టే నేతన్నలకు కూడా సాయం చేస్తామన్నారు. సిరిసిల్లలో చేనేతలకు రూ.5 కోట్లతో కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని, తక్షణమే నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. ఇంజినీరింగ్ కాలేజీ కావాలని డిమాండ్ ఉందని, జేఎన్టీయూను ఆదేశించి త్వరలో నిర్మాణం చేయిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు పెంచేందుకు ఇటీవలే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని, తర్వలో సిరిసిల్లకు కూడా మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని అన్నారు.