వీఆర్ఏ వ్యవస్థ రద్దు..కొత్త పేర్లతో..కొత్త ఉద్యోగాలు

వీఆర్ఏ వ్యవస్థ రద్దు..కొత్త పేర్లతో..కొత్త ఉద్యోగాలు

వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పని చేస్తున్న వీఆర్ఏలను రెవెన్యూ శాఖలో  సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ సిఫారసుల మేరకు.., నిబంధనలకు అనుగుణంగా వీఆర్ఏల అర్హతలను బట్టి.. మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ వంటి  శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. దీనికి సంబంధించి జులై 24వ తేదీ ఉత్తర్వులను విడుదల చేయాలని సీఎస్  శాంతి కుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. 61 ఏండ్లు దాటిన వీఆర్ఏల ఉద్యోగాన్ని వారి వార‌సుల‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

రాష్ట్రంలో వీఆర్ఏ ల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై  సచివాలయంలో సీఎం కేసీఆర్ జులై 23వ తేదీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.  కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నామని సీఎం వివరించారు. ప్రతి గ్రామంలో నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంతో పాటు గ్రామ రెవెన్యూ తదితర అవసరాల కోసం ఏర్పాటైన గ్రామ సహాయకుల వ్యవస్థ నేటి వీఆర్ఏలుగా రూపాంతరం చెందిందని సీఎం తెలిపారు.  తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్ఏల త్యాగపూరిత సేవ గొప్పదని కేసీఆర్ కొనియాడారు. అయితే మారిన పరిస్థితుల్లో వీఆర్ఏల వృత్తికి ప్రాధాన్యత తగ్గిన నేపథ్యంలో.., వారికి రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పించి.. పర్మినెంట్ చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

వీఆర్‌ఏల సర్దుబాటు, క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఎక్కువ మందిని నీటిపారుదల శాఖ, మిషన్‌ భగీరథలకే మళ్లించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 23,046 వీఆర్‌ఏ పోస్టులుండగా ప్రస్తుతం 21,433 మంది విధుల్లో ఉన్నారు. క్రమబద్ధీకరణ అనంతరం పేస్కేల్‌ కింద ఎంత మొత్తం చెల్లించాలనేది ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయిస్తుంది. వీఆర్‌ఏలలో పీజీ, డిగ్రీ తదితర ఉన్నత విద్య పూర్తి చేసిన వారు దాదాపు 5వేల మంది ఉన్నారు. నీటిపారుదల శాఖలో సహాయకుల కింద 1,034 మందిని, లష్కర్ల కింద 4,374 మందిని, 3వేల మందిని మిషన్‌ భగీరథలో నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. మిగిలిన వారిలో కొందరిని పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల్లోకి తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

వీఆర్ఏ ల క్రమబద్దీకరణ సర్దుబాటు విధానం..

రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏ లు పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, ఏడవ తరగతి పాసైనవారు, పదవ తరగతి పాసైనవారు, ఇంటర్మీడియేట్ వరకు మాత్రమే చదివి పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు. వీరి విద్యార్హతను బట్టి ప్రభుత్వం ఉద్యోగ కేటగిరీలను నిర్ధారిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో వారి భర్తీ చేయనున్నారు. ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారికి అందుకనుగుణమైన పోస్టుల్లో భర్తీ చేయనున్నారు. . 

61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించనుంది. అదేవిధంగా... 2 జూన్ 2014 అనంతరం 61 ఏండ్ల లోపు ఉండి ఏ కారణం చేతనైనా వీఆర్ఏ విధులు నిర్వహిస్తూ మరణించిన వీఆర్ఎ వారసులకు  కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పించనుంది. కాగా... చనిపోయిన వీఆర్ఏ ల వారసుల వివరాలు, వారి విద్యార్హతలు త్వరలో సేకరించాలని అధికారులను వీఆర్ఏ జేఏసీ నేతలకు సీఎం కేసీఆర్ తెలిపారు. వీరికి కూడా నిబంధనలకు అనుసరించి అర్హతల మేరకు, ఆయా శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.